చీలిక దిశగా నితీష్ కుమార్ పార్టీ జేడీయూ?

బిహార్ లో అధికారంలో ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీ (జేడీయూ) కూడా చీలిక దిశగా వెళ్తోందా? పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై పార్టీలో వ్యతిరేకత పెరుగుతోందా? శివసేన, ఎన్సీపీల తర్వాత జేడీయూలో చీలిక తప్పదా? ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఇవే చర్చలు జరుగుతున్నాయి.

పాట్నాలో గత నెల 23న నితీష్ కుమార్ నేతృత్వంలో ప్రతిపక్షాల భేటీ జరిగిన రెండు వారాలకే ఆ భేటీలో కీలక పాత్ర పోషించిన శరద్ పవర్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలికకు గురయింది.  మహారాష్ట్రలో ఎన్సీపీ కీలక నేత అజిత పవార్  పార్టీని చీల్చి, బీజేపీ నాయకత్వంలోని కూటమిలో చేరారు. బీజేపీ, శివసేన (షిండే వర్గం) ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి అయ్యారు.

మరోవైపు, బిహార్ లో కూడా జేడీయూ అధినేత నితీష్ కుమార్ పై పార్టీలో వ్యతిరేకత పెరుగుతోందని, త్వరలో జేడీయూలో కూడా చీలిక తప్పదని బీజేపీ చెబుతోంది. ముఖ్యంగా తన వారసుడిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ను నితీశ ప్రకటించడం, జాతీయ స్థాయి విపక్ష కూటమికి రాహుల్ నాయకత్వం వహించడానికి ఆమోదం తెలపడం వంటి చర్యలు నితీశ్ పై పార్టీలో వ్యతిరేకత పెరగడానికి కారణమని భావిస్తున్నారు.

జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది తమను సంప్రదిస్తున్నారని బీజేపీ ఎంపీ, మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ  వెల్లడించారు. పొత్తుల కారణంగా, వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ లభించే అవకాశం లేదని, ఒక వేళ టికెట్ లభించినా నితీశ్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా కచ్చితంగా ఓడిపోతామని వారు భావిస్తున్నారని సుశీల్ మోదీ తెలిపారు.

ఆర్జేడీతో పొత్తు వల్ల జేడీయూ నష్టపోతోందని వారు భావిస్తున్నారని వెల్లడించారు. జేడీయూకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు,ఎంపీల్లో నితీశ్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఎలాంటి షరతులు లేకుండా వారు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో బీజేపీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

“జేడీయూలో తిరుగుబాటు నెలకొనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. జేడీయూకి భవిష్యత్తు లేదనుకుంటున్నారు. నితీశ్ కుమార్ తన వారసుడిగా తేజస్వీని ప్రకటించడం పార్టీకి చేటు చేస్తుందని భావిస్తున్నారు. అందువల్ల, వారంతా బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీలో చేరడానికి పోటీ పడుతున్నారు’’ అని సుశీల్ మోదీ ప్రకటించారు.

జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది తమను సంప్రదించారని సుశీల్ మోదీ తెలిపారు. ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి? ఎవరిని తీసుకోకూడదు? అనే విషయంలో బీజేపీ ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి జేడీయూలో మాత్రం పరిస్థితి చాలా అస్థిరంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘‘పైగా, పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సీఎం నితీశ్ ఏ మాత్రం సమయం ఇవ్వడం లేదు. వారిని సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తుపై వారికి భరోసా ఇవ్వడం లేదు. ఆ అసంతృప్తి కూడా వారిలో ఉంది’’ అని సుశీల్ మోదీ వివరించారు.

అయితే, నితీశ్ కుమార్ పార్టీ అయిన జేడీయూతో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోదని సుశీల్ కుమార్ మోదీ స్పష్టం చేశారు. దాదాపు 17 ఏళ్ల పాటు నితీశ్ కుమార్ ను మోశామని, ఇకపై ఆ తప్పు చేయబోమని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని బీజేపీ అగ్రనేత అమిత్ షానే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ‘‘చివరకు నితీశ్ స్వయంగా వచ్చి చేతులు కట్టుకుని నిల్చున్నా  ఆయనతో కలిసే ప్రసక్తే లేదు. అని అమిత షా అన్నారు’’ అని సుశీల్ వెల్లడించారు.