
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడిగా శరద్ పవార్‌ని తొలగిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం ప్రకటించారు. ఎన్‌సిపి అధ్యక్షుడిగా తాను కొనసాగనున్నట్లు ఎలక్షన్ కమిషన్‌కు తెలిపారు. గత ఆదివారం తన బాబాయి, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అజితపవార్, ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి మంత్రివర్గంలో చేరిన సంగతి తెలిసిందే.
పార్టీ ఎమ్మెల్యేలతో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, చీలక వర్గం నేత అజిత్ పవార్ వేర్వేరుగా సమావేశం ఏర్పాటు చేసి బలప్రదర్శనకు దిగారు. ఎమ్మెల్యేలతో సమావేశమైన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తనకున్న ఎమ్మెల్యేల బలంతో అజిత్ పవార్ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. నిజమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ గుర్తు తమదేనని ఈసీకి దాఖలు చేసిన పిటిషన్‌లో అజిత్ పవార్ స్పష్టం చేశారు.
మొత్తం 53 మంది ఎమ్మెల్యేలలో 35 మంది ఎమ్మెల్యేల బలం తనకుందని ఈసీ దృష్టికి తెచ్చారు. కాగా, జూన్ 30నే శరద్ పవర్ ను ఎన్సీపీ అధ్యక్షునిగా తొలగించి, అజిత్ పవర్ ను నియమించినట్లు సీనియర్ నేత సునీల్ ఠాక్రే మీడియాకు వెల్లడించారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తు తమవేనని క్లెయిమ్ చేస్తూ అజిత్ పవార్ వేసిన పిటిషన్ భారత ఎన్నికల సంఘానికి అందినట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత ప్రక్రియను ప్రారంభించినట్టు జయంత్ పాటిల్ నుంచి కేవియట్ కూడా అందిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి ముందు, పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో శరద్ పవార్‌పై అజిత్ పవార్ ఘాటు విమర్శలకు దిగారు.
”మీరు (శరద్ పవార్) నన్ను అందరిముందు విలన్‌గా చూపించారు. ఇప్పటికీ మీరంటే నాకు గౌరవం ఉంది. మీరే చెప్పండి…ఐఏఎస్ అధికారులు 60 ఏళ్లకు పదవీ విరమణ చేస్తున్నారు. రాజకీయాల్లో కూడా బీజేపీ నేతలు 75 ఏళ్లకు రిటైర్ అవుతున్నారు. ఎల్.కె.అడ్వాణి, మురళీ మనోహర్ జోషిలను ఉదాహరణగా తీసుకోండి” అంటూ హితవు చెప్పారు.
“కొత్త జనరేషన్ ఎదిగేందుకు అవకాశం ఇవ్వండి. మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి. మీ వయస్సు 83. ఇప్పటికైనా ఆగరా? మీరు మాకు ఆశీస్సులు ఇస్తే, మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో ఉంటాలని మేము భగవంతుని ప్రార్థిస్తాం” అని అభ్యర్ధించారు. కొద్ది నెలల క్రితం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శరద్ పవార్ మనసు మార్చుకోవలసిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.
2014 ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బిజెపికి ఎన్‌సిపి ఎందుకు మద్దతు ఇచ్చింది అని ఆయన నిలదీశారు. మహారాష్ట్రకు ముఖ్యమంత్రిని కావడమే తన లక్ష్యమని, సీఎం అయితేనే, ప్రజల సంక్షేమానికి సంబంధించి తన వద్ద ఉన్న ప్రణాళికలను అమలు చేయడం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తన మనసులోని మాటను వెల్లడించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు ఎన్సీపీకే వచ్చినా సీఎం పదవిని కాంగ్రెస్ కు అప్పజెప్పి శరద్ పవార్ తప్పు చేశారని, అలా చేయకుండా ఉండి ఉంటే, ఇప్పటివరకు కూడా మహారాష్ట్రకు ఎన్సీపీ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండేవాడని అజిత్ పవార్ చెప్పారు.
మరోవంక, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు తమతోనే ఉందని, ఎక్కడికీ పోలేదని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. తమను అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమవెంటే ఉన్నారని తెలిపారు. ముంబైలోని వైబీ చవాన్ సెంటర్‌లో బుధవారంనాడు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీని చీల్చేందుకు నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలను తాము పరిగణనలోకి తీసుకోమని చెప్పారు.
అజిత్ పవార్ వర్గం ఎలాంటి విధివిధానాలను పాటించలేదని పవార్ స్పష్టం చేశారు. ”అజిత్ పవార్‌కు ఏదైనా సమస్య ఉంటే నన్ను సంప్రదించాల్సింది. ఆయన మనస్సులో ఏదైనా ఉంటే ఆ ఆలోచన నాతో పంచుకుని ఉండొచ్చు” అని పవార్ పేర్కొన్నారు.
More Stories
పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో ఢిల్లీలో విజయం
వరల్డ్ ఆడియో విజువల్ సదస్సుపై ప్రధాని మోదీ భేటీ
అభివృద్ధి, సుపరిపాలనే గెలిచింది