సుదీర్ఘకాలం ఎన్డీయేలో బిజెపికి భాగస్వామిగా ఉండటమే కాకుండా, పంజాబ్ లో రెండు సార్లు ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అకాలీదళ్, బిజెపి తిరిగి దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ద్వారా పంజాబ్ లో తిరిగి తమ పట్టు నిలుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు జరిపిన ఉద్యమంకు మద్దతుగా అకాలీదళ్ ఎన్డీయే నుండి నిష్క్రమించింది. ఆ తర్వాత సాగుచట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నప్పటికీ, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరికీ వారుగా పోటీచేసి పంజాబ్‌లో ఓటమి చవిచూసారు. ఈ క్రమంలో ఇరు పార్టీలు మళ్లీ పొత్తుకు సిద్ధమవుతున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఈ మధ్య కాలంలో పంజాబ్ లో ఆప్ బలపడటంతో అకాలీదళ్ రాష్త్ర రాజకీయాలలో మూడో స్థానంకు చేరుకొంది. బిజెపి కూడా ప్రాబల్యం కోల్పోతూ వస్తున్నది. 2024 ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం గురించి మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దివంగత ప్రకాష్ సింగ్ బాదల్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల ఘనంగా నివాళులర్పిస్తూ ఆయనను సౌభ్రాతృత్వానికి అధిపతిగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఏప్రిల్ 26న ఛండీగఢ్ వెళ్లి బాదల్‌కు నివాళులర్పించారు.
కాగా, ఈనెల 6వ తేదీన పార్టీ కీలక సమావేశాన్ని సాద్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ బాదల్ ఛండీగఢ్‌లో ఏర్పాటు చేశారు. పార్టీకి చెందిన అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, జతేదార్లు ఇందులో పాల్గోనున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అకాలీదళ్ రాజకీయ గ్రాఫ్ 2017 నుంచి కిందకు పడిపోతోంది. పంజాబ్‌లో ప్రధాన విపక్ష పార్టీగా చోటు కూడా దక్కించుకోలేకపోతోంది.
2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించగా, సాద్ మూడో స్థానానికి పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ విపక్షంలోకి వచ్చింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సాద్ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుతం పంజాబ్‌లో సాద్‌కు రెండు పార్లమెంటరీ సీట్లు మాత్రమే ఉన్నాయి. సుఖ్‌బీర్ బాదల్, ఆయన భార్య హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ మాత్రమే ఎంపీలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో సాద్-బీజేపీ పొత్తు ఉభయ పార్టీలకు ప్రయోజనకారిగా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనాగా ఉంది.
More Stories
భారతదేశ వారసులు హిందువులే
భారత్ లో ఓటింగ్‌ను పెంచేందుకు అమెరికా నిధులు?
ఛత్తీస్‌గఢ్ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి క్లీన్ స్వీప్