నలుగురు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్

ఉగ్రవాద సంస్థ ఐసిస్ కోసం పని చేస్తున్న నలుగురిని న్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వారు ఐసిస్ తరఫున భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు  సహకరించడం, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడం, యువతను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రోత్సహించడం చేస్తున్నట్లు ఎన్ఐఏ ఆరోపిస్తోంది.

నిఘా వర్గాల సమాచారం మేరకు సోమవారం రాత్రి ముంబై, థానే, పుణెల్లో ఎన్ఐఏ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. అనంతరం, దక్షిణ ముంబైలోని నాగ్పడ నుంచి తాబిష్ నూర్ సిద్దిఖీ, పుణెలో జుబైర్ నూర్ మొహమ్మద్ షేక్, అబూ నుసైబా, థానెలో షార్జీల్ షేక్ లను అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.

వారి వద్ద ఉగ్రవాద సాహిత్యం, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, కొన్ని పత్రాలు, ఐసిస్ కు సంబంధించిన మరికొన్ని రహస్య పత్రాలు ఎన్ఐఏ అధికారులకు లభించాయి. భారత్ లో ఐసిస్ ఉగ్రవాద కార్యక్రమాలకు సహకరించడంతో పాటు, యువతను ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేలా ప్రోత్సహించడం ఈ నలుగురి ప్రధాన లక్ష్యంగా ఉందని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.

ఐసిస్, ఐఎస్, ఐసిల్, ఐఎస్కేపీ, ఐసిస్ కే తదితర పేర్లతో భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్లు తేలిందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. వీరు మహారాష్ట్రలో ఐసిస్ కోసం స్లీపర్ సెల్స్ ను నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు.

యువతను ఉగ్రవాద సంస్థలో చేరేలా ప్రోత్సహించడంతో పాటు, వారికి పేలుడు పదార్ధాల తయారీ, రూపకల్పన, చిన్న ఆయుధాల తయారీ, వినియోగం పై వీరు శిక్షణ ఇస్తున్నారని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, వీరు వాయిస్ ఆఫ్ హింద్ పేరుతో ఉన్న మేగజీన్ ను నడుపుతూ ఉగ్రవాద సమాచారాన్ని పంచుకుంటున్నారని తెలిపారు.