వ్యక్తుల గోప్యతకు భంగం కల్గిస్తే రూ 250 కోట్ల జరిమానా

వ్యక్తిగత గోప్యత సంబంధిత డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షస్ (డిపిడిపి) బిల్లు 2023 ముసాయిదాకు కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం మంత్రిమండలి భేటీ జరిగింది. ఈ డిపిడిపి బిల్లును రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలల్లోనే ప్రవేశపెడతారని అధికార వర్గాలు తెలిపాయి.
 
బిల్లులో డిజిటల్ పద్ధతిలో వ్యక్తిగత గోప్యత సంబంధిత నిబంధనలను పొందుపర్చారని, వీటిని ఉల్లంఘించినట్లు తేలితే ప్రతి ఒక్క సారి సంబంధిత సంస్థలకు రూ 250 కోట్ల మేర జరిమానా వేస్తారని నిర్ధేశించినట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి ఆగస్టు 11వరకూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. సంప్రదింపుల కోసం ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన చివరి ముసాయిదాలోని దాదాపు అన్ని నిబంధనలను ఈ బిల్లులో పొందుపరిచారు.
‘వివాదాలను పరిష్కరించే అధికారం డేటా ప్రొటెక్షన్‌ బోర్డుకు అప్పగించారు. పౌరులు సివిల్‌ కోర్టును ఆశ్రయించడంతో నష్ట పరిహారాన్ని క్లెయిమ్‌ చేసే హక్కును కలిగి ఉంటారు’ అని చెప్పారు.  చట్టం అమలు చేయబడిన తరువాత వ్యక్తులు వారి డేటా సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్‌ గురించి వివరాలను కోరుకునే హక్కును కలిగి ఉంటారు.
ఇక ప్రభుత్వ సంస్థలకు ప్రతిపాదిత చట్టం నుంచి సంపూర్ణ మినహాయింపులు ఏమీ లేవని అధికార వర్గాలు తెలిపాయి. జరిగే ఉల్లంఘనలను బట్టి అన్ని స్థాయిల సంస్థలకు జరిమానాలు శిక్షలు పడుతాయని వివరించారు. వివాదాల విషయంపై డేటా ప్రొటెక్షన్ బోర్డు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.  పౌరులు తమ గోప్యత వివరాలకు భంగం కల్గినట్లు భావిస్తే సంబంధిత సివిల్‌కోర్టులకు వెళ్లి, పరిహారానికి డిమాండ్ చేయవచ్చునని, సంబంధిత చట్టంలో పొందుపరిచే పలు అంశాలపై త్వరలోనే పూర్తి స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. 
 
వ్యక్తులకు వారి డేటా కలెక్షన్, స్టోరేజ్ ప్రాసిసింగ్‌కు సంబంధించి వివరాలు పొందవచ్చునని , ఇందుకు ఈ బిల్లులో సరైన విధంగా ప్రతిపాదనలు చేశారని అధికార వర్గాలు తెలిపాయి.