కాంగ్రెస్ పై జెడిఎస్‌తో కలసి పోరాటంకు యడియూరప్ప సై

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలలో తన బలాన్ని సగానికి సగం కోల్పోయిన జేడీఎస్ బిజెపితో సఖ్యతకు చూస్తున్నదనే కథనాలకు బలం చేకూర్చే విధంగా మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు యడియూరప్ప మంగళవారం కీలక ప్రకటన చేశారు.  కర్నాటకలో తమ పార్టీ, హెచ్‌డి కుమారస్వామి సారథ్యంలోని జనతా దళ్ (ఎస్) కలసి భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడతాయని వెల్లడించారు. 

కుమారస్వామి చెబుతున్నదంతా వాస్తవమని, ఆయన ప్రకటనకు తాను మద్దతు తెలుపుతున్నానని విలేకరులతో మాట్లాడుతూ యడియూరప్ప తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చని పక్షంలో బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతుందని ఆయన చెప్పారు. బిజెపి ఎటువంటి డిమాండ్లు చేయడం లేదని, ప్రజలకు చేసిన ఐదు వాగ్దానాలను అమలు చేయమని మాత్రమే తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదు వాగ్దానాల అమలు కోసం ఒక వారం రోజుల వ్యవధి ఇస్తున్నామని, అలా జరగని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

కాగా..కర్నాటకలో మరో అజిత్ పవార్ తయారవుతున్నారని మరో ప్రకటనలో కుమారస్వామి వ్యాఖ్యానించారు. బిజెపికి మద్దతివ్వాలన్న అజిత్ పవార్ నిర్ణయం కర్ణాటకలో కూడా పునరావృతం  అవుతుందేమోనన్న ఆనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంటే కర్ణాటక కాంగ్రెస్ లో చీలిక తప్పదనే సంకేతం ఇచ్చారు.