ఉగ్రవాదంపై సమిష్టి పోరుకు ప్రధాని మోదీ పిలుపు

ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అలాగే సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను విమర్శించేందుకు కూడా వెనుకాడకూడదని హితవు చెప్పారు. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పు అని చెబుతూ దీనిని కట్టడి చేయడానికి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. దీనిపై మనమంతా కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు.

షాంఘై సహకార కూటమి (ఎస్‌సిఓ) దేశాధినేతల సమావేశం మంగళవారం న్యూఢిల్లీలో వర్చువల్‌గా ప్రారంభమైంది. సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదం, ఉగ్రవాదానికి నిధులు అందించడంపై నిర్ణయాత్మక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ఉగ్రవాదం ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించిందని నొక్కి చెప్పారు.

చైనాను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలను బహిరంగంగా విమర్శించడానికి ఎస్‌సీఓ సభ్య దేశాలు ముందుకు రావాలని కోరారు. ఈ విషయంలో సంశయం పనికిరాదని అంటూ ఎస్‌సీఓ సభ్య దేశాలు ఇటువంటి దేశాల తీరును ఖండించాలని ప్రధాని స్పష్టం చేశారు.

`కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని తమ విదేశాంగ విధానంలో భాగంగా చేసుకుంటున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను సమకూర్చడం వాటిని నిరోధించడానికి నిర్ణయాత్మక చర్యలు అవసరం. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను విమర్శించడంలో ఈ కూటమి ఎప్పుడూ వెనుకాడకూడదు. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెనుముప్పుగా మారింది. దానిపై మనమంతా కలిసికట్టుగా పోరాడాలి’ అని ప్రధాని పిలుపునిచ్చారు.

గ్రూపుల వల్ల కలిగే ముప్పును ఎదుర్కొనేందుకు పరస్పర సహకారాన్ని విస్తరించుకోవాలని దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని పునరుద్ఘాటిస్తూ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ విధంగా వ్యక్తీకరించినా కలిసి పోరాడాలని పిలుపిచ్చారు.

భారత్‌ ఈ గ్రూపులో సభ్యురాలిగా మారిన తర్వాత మొదటిసారిగా స్వదేశంలో నిర్వహిస్తోంది. భారత్‌ నేతృత్వంలో జరుగుతున్న రష్యా, చైనా, పాకిస్తాన్‌ దేశాలతో పాటు కజకిస్తాన్‌, కిర్గిస్తాన్‌, తజికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, ఇరాన్‌ దేశాలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యాయి.  ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని మోదీ పలు అంతర్జాతీయ సవాళ్లను కూడా ప్రస్తావించారు.

వివాదాలు, ఉద్రిక్తతలు, అంటువ్యాధులు చుట్టుముట్టిన ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇంధనం, ఆహారం, ఎరువుల సంక్షోభం అతి పెద్ద సవాలుగా నిలిచాయని చెప్పారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి గురించి మాట్లాడుతూ ఎస్‌సిఓలోని దేశాల మాదిరిగానే భారత్‌లోనూ ఆ దేశంపై ఆందోళనలు నెలకొన్నాయని తెలిపారు.

యూరాసియా శాంతి, సౌభాగ్యాలు, అభివృద్ధికి ముఖ్యమైన వేదికగా ఎస్‌సీఓ ఎదిగిందని చెప్పారు. ఎస్‌సీఓలో భాషాపరమైన అడ్డంకులను తొలగించడం కోసం కృత్రిమ మేధాశక్తి ఆధారిత వేదిక ‘భాషిణి’ని అందరితోనూ పంచుకుంటామని చెప్పారు. డిజిటల్ టెక్నాలజీకి, సమ్మిళిత వృద్ధికి ఇది ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు.

ఐక్య రాజ్య సమితిలోనూ, ఇతర అంతర్జాతీయ వ్యవస్థలలోనూ సంస్కరణల కోసం ముఖ్యమైన గళంగా ఎస్‌సీఓ నిలవగలదని తెలిపారు. ఎస్‌సిఓ కుటుంబంలో ఇరాన్‌ కొత్త సభ్యునిగా చేరుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.