సీఎం రిలీఫ్‌ ఫండ్ పేరుతో భారీ కుంభకోణం

తెలంగాణలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) పేరుతో పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లుగా అధికారుల విచారణంలో తేలింది. మిర్యాలగూడలో బయటపడ్డ కేసులో తీగలాగిన అధికారులకు నమ్మలేని నిజాలు తెలిశాయి.
 
సీఎం రిలీఫ్ ఫండ్ నగదు కోసం నకిలీ రోగులను సృష్టించడమే కాకుండా తప్పుడు బిల్లులు పెట్టుకొని పెద్ద మొత్తంలో నగదు స్వాహా చేసినట్లుగా తేలింది. ఏప్రిల్‌ నెలలో సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదువడంతో దర్యాప్తు చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు నలుగురు నిందితుల్ని గుర్తించారు. వారిని అరెస్ట్ చేసేందుకు సిద్దమయ్యారు.
 
ఒకచోట కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా నేరానికి పాల్పడి సర్కారును మోసం చేసిన కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరూ అనే విషయాన్ని రాబట్టడానికి ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.  సీఎం రిలీఫ్‌ ఫండ్ పేరుతో అప్పనంగా డబ్బులు నొక్కేసేందుకు నకిలీ రోగులను సృష్టించడమే కాకుండా, తప్పుడు బిల్లులు పెట్టి కుంభకోణానికి తెరతీశారు.
 
సీఎం రిలీఫ్ ఫండ్ కుంభకోణంపై ముమ్మర దర్యాప్తు చేస్తున్న సీఐడీ మరికొందరిని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో ప్రజాప్రతినిధుల పీఏలే ఉన్నారా? లేక ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉందా? అనే కోణంలో సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.