పురాతన బర్మా టేకుపై అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి

ప్రపంచం లోనే అతి పెద్ద బర్మా టేకు జాతి మహా వృక్షము ఇది. 21అడుగులు పొడవు, 8.5 అడుగుల ఎత్తు, 20 అడుగుల కైవారం కలిగిన టేకు దుంగ. దాని వయసు సుమారు 1000 నుండి 1500 సంవత్సరాలు. ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రపంచంలోనే అరుదైన ఈ టేకు దుంగను అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ సంస్థ వారు బర్మా ప్రభుత్వం జరిపిన వేలం పాటలో భారీ మొత్తంలో ఖరీదు చేసి దక్కించుకున్నారు.

ఈ చెట్టును వ్యాపార నిమిత్తం కోసి ముక్కలు చేయకుండా భావి తరాలకు దీని భవ్య రూపాన్ని పదిలపరచాలని, చెడగొట్టకుండా, దీనిని అద్భుతమైన శిల్ప కళా ఖండంగా తీర్చిదిద్ది రాబోయే తరాలకు ప్రదర్శన యోగ్యమైన రీతిలో అందించాలనే సదుద్దేశ్యంతో తో ఆ విశేషమైన వృక్ష ఖండాన్ని శిల్పంగా చేయించాలని సంకల్పించారు. ఈ బృహత్ ప్రణాళికకు సమర్థుడైన చిత్రకారుని అన్వేషించారు.

అప్పుడు వారి దృష్టికి గిరిధర గౌడ్ దొరికారు. అతనితో ప్రణాళిక సిద్ధం చేయించి, చాలా రేఖా చిత్రాలను గీయించి, వాటిని బర్మా ప్రభుత్వంకు చూపించి అతి కష్టమైన రీతిలో సంవత్సరం కాలం తర్వాత అధికారిక అనుమతి పొందారు. తర్వాత యోగ్యులైన బర్మా శిల్పులతో శిల్పం పూర్తి చేయించి భారత్ కు తీసుకుని రావడానికి మరలా రెండు నుండి మూడు సంవత్సరాలు సమయం పట్టింది.

 దాన్ని ఓడమీద భారతతీరానికి చేర్చారు. చుట్టూ భద్రత కొరకు భారీ ప్యాకింగ్ పద్దతి ని అవలంబించి, పెద్ద కంటెయినర్ లో దాన్ని హైదరాబాదుకు చేర్చారు. ఇప్పుడు బోయినపల్లిలోని అనూరాధా టింబర్స్ ఇంటర్నేషనల్ ప్రాంగణంలో గిరిధర్ ఊహించినట్టుగా పూర్తి వివరాలతో ఆ శిల్పం పూర్తి అయింది. ఈ దారు శిల్పం పేరు శ్రీ అనంత శేష శయన శ్రీ మహా విష్ణుమూర్తి.

దీనిని శ్రీమత్ భగవత్ గీత 11 వ అధ్యాయం -6 వ శ్లోకంను స్ఫూర్తిగా తీసుకుని రాయన గిరిధర గౌడ్ చే చిత్ర ప్రణాళిక ప్రకారము శిల్పాన్ని పూర్తి చేశారు. ఇందులో పెద్, చిన్న శిల్పాలు సుమారు 84 ఉన్నాయి.

శ్లో: పశ్యాదిత్యాన్, వసూన్ రుద్రాన్అశ్వినౌ, మరుతస్థథా, బహూన్యదృష్టపూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత!

ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు తనలోని వారే అని మహావిష్ణువు చెప్పిన వాక్కును ఆధారంగా శిల్పం చెక్కారు. శ్రీ మహావిష్ణువును అనంతశయన మూర్తిగా శిరస్సు ఎడమవైపునకు, పాదాలు కుడివైపునకు ఉండేటట్టు చెక్కారు.

అనంతశేషుని దివ్యమంగళమైన పడగల కింద కిరీటం ధరించి, దివ్యాభరణములతో శ్రీ మహా విష్ణువు, శ్రీదేవి, భూదేవి సమేతంగా చెక్కారు. ఆ పక్క వాసుకి భగవంతునికి వినమ్రతతో నమస్కరిస్తూ, విప్పారిన రెక్కలతో పక్షిరాజు గరుత్మంతుడు, నారదమహర్షి, తుంబురుడు, సప్త ఋషులు, విష్ణు భక్తులైన సనక సనందనాదులు ఉన్నారు.

సకల దేవతా మూర్తులు ఉపస్థితమై ఉన్నట్లు చెక్కారు. ఇటువంటి అరుదైన విశిష్టత గలిగిన అపురూపమైన కళా ఖండాన్ని ప్రదర్శన యోగ్యంగా మాజీ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు  శనివారం ఉదయం ఆవిష్కరించారు.