మహారాష్ట్ర బస్సులో ప్రమాదంలో 25 మంది సజీవ దహనం

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 25 మంది బస్సులోనే సజీవదహనమయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలవ్వగా, క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదం సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
 
బస్సు మహారాష్ట్రలోని యావత్మాల్ నుంచి పుణె వెళ్తుండగా బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలకు బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.  శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. హఠాత్తుగా టైర్ పేలడంతో బస్సు పల్టీ కొట్టిందని, ఈ సమయంలో బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం.
 
ఇద్దరు డ్రైవర్లు ఉండగా,  క్లీనర్‌తో పాటు మ‌రో డ్రైవ‌ర్ అదృష్ట‌వ‌శాత్తు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. డోరు ఉన్న సైడే బ‌స్సు ప‌డిపోవ‌డం వ‌ల్ల‌.. దాని నుంచి జ‌నం త‌ప్పించుకోక‌పోయిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో స‌జీవంగా ఉన్న వారు డ్రైవ‌ర్ సైడ్ వ‌ద్ద ఉన్న క్యాబిన్ సీటులో కూర్చున్నారు. వాళ్లు ముందు అద్దాల‌ను ప‌గుల‌గొట్టి త‌ప్పించుకున్నారు.
 
ప్ర‌మాదం స‌మ‌యంలో బ‌స్సులో ఉన్న ప్ర‌యాణికులు అంద‌రూ నిద్ర‌లో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో వెంటనే బుల్ధానా సివిల్ హాస్పిటల్‌కు పోలీసులు తరలించారు.
 
మరణించినవారి మృతదేహాలను కూడా పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు గుర్తించి వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.  అగ్నిప్రమాదంతో బస్సు నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీని నుంచి వచ్చిన దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి.
 
దీంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. బుల్దానా పోలీస్ డిప్యూటీ ఎస్పీ బాబూరావు మహాముని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామని ఆయన తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబ సభ్యులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. గాయపడినవారికి చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. ‘‘మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయవిదారకం. ఈ భయానక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు ఈ విషాద సమయంలో సంఘీభావం తెలుపుతున్నాను. గాయపడినవారికి ప్రభుత్వ యంత్రాంగం సత్వర చికిత్స అందిస్తోంది. గాయపడినవారు వేగంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.

ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ బస్సులో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం దురదృష్టకరమని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా విచారకరమని, మనసును కలచివేస్తోందని తెలిపారు. ప్ర‌మాదానికి గురైంది విద‌ర్భ ట్రావెల్స్‌కు చెందిన బ‌స్సుగా గుర్తించారు. నాగ‌పూర్ నుంచి పుణె వెళ్తుంటే ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

ప్రమాదం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ మృతిచెందిన కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి ఎకనాథ్ షిండే ప్రకటించారు.  క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.