రూ.26వేల కోట్ల‌తో ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్ట్

తెలంగాణ హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టుపై రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలి ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్‌కు కేంద్రం పచ్చజెండా ఊపింద‌ని చెబుతూ ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.  మొత్తం 350 కిలోమీటర్ల ఆర్‌ఆర్‌ఆర్‌ రోడ్డు తెలంగాణలోని చాలా జిల్లాలను కలుపుతుందని పేర్కొన్నారు.
రూ. 26 వేల కోట్ల ఖర్చుతో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగందని చెప్పారు. రూటు ఎలా ఉండాలనేదానికి 99 శాతం ఆమోదం లభించిందని తెలిపారు.  భూసేకరణ ఖర్చు 50 శాతం కేంద్రమే భరించేందుకు అంగీకరించగా,  రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.
ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ సమాంతరంగా ఔటర్ రైల్ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టిందని చెబుతూ సర్వే త్వరలో మొదలుకానుందని వెల్లడించారు.  హైదరాబాద్ నలువైపుల ఉన్న రైల్వే లైన్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రజారవాణాతో పాటుగా వస్తువుల రవాణా కూడా పెరిగి, వ్యాపారపరంగా గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.
 
రీజనల్ రింగ్ రోడ్డు చుట్టుక్కల వచ్చే పరిశ్రమలు, మాల్స్, వినోద కేంద్రాలు, శాటిలైట్ టౌన్స్ మొదలైన వాటి ద్వారా లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయని,  దీనిద్వారా విద్య, వ్యాపారం, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరగటంతో పాటు మెడికల్ సౌకర్యాలు కూడా సమయానికి అందుబాటులో ఉంటాయని అన్నారు.
ఆర్‌ఆర్‌ఆర్‌, ఔటర్‌ రింగ్‌ రైలుతో హైదరాబాద్‌కు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
విజయవాడ, గుంటూరు, వరంగల్‌, మెదక్‌, ముంబయి రైల్వే లైన్లకు ఔటర్‌ రింగ్‌ రైలు కనెక్టివిటీగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఘ‌ట్ కేస‌ర్ – రాయగ‌ర్ మార్గం నిర్మించాల‌ని భావిస్తున్న‌ట్లు కేంద్ర మంత్రి వెల్ల‌డించారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత యాదాద్రికి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిపోవడంతో, దీన్ని దృష్టిలో పెట్టుకొని  యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని పొడగించనున్నట్టు వెల్లడించారు.
 
హైదరాబాద్ ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్‌లో భాగంగా సికింద్రాబాద్‌ నుంచి ఘట్‌కేసర్ వరకు మార్గాన్ని పొడిగిస్తున్నారు. దానితో, మరో 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి వరకు కూడా ఎంఎంటీఎస్ సేవలను పొడిగించాలన్న ప్రజల డిమాండ్ మేరక ఘట్కేసర్- రాయగిరి రైల్వేలైన్‌ను కూడా పూర్తి చేయాలని నిర్ణయించినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. ఒక వేళ రెండో దశ పూర్తయితే హైదరాబాద్ నుంచి కేవలం 45 నిమిషాల్లోనే 15 నుంచి 20 రూపాయల ఖర్చుతో భక్తులు యాదాద్రి చేరుకునే అవకాశం ఉండనుంది.