తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు లేదు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను ఆ పదవి నుండి తప్పిస్తున్నారని, మరో సీనియర్ నాయకుడిని నీయమిస్తున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆ పార్టీ నాయకులు కొట్టిపారేసారు. పార్టీ నాయకత్వం ముందు అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించబోతున్నారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి.
 
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పుపై అంశం ఏమీ లేదని, అటువంటి నిర్ణయాలు అధిష్టానం ఏం తీసుకోలేదని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ అంశంలో ఎవరూ గందరగోళంలో లేరని, అయితే మీడియా గందరగోళం సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు ఎందుకు వచ్చాయో తమకు తెలవదని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను మార్చి కొత్తవారిని నియమించే అవకాశం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

బండి సంజయ్‌కి కొత్త పదవి ఇవ్వాలని, కొత్తవారికి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే చర్చ జరగలేదని అంటూ కావాలని కొంత మంది మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నాలుగు నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో అధిష్టానం ఎలాంటి మార్పులు చేయదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా, బిజెపి తెలంగాణ అధ్యక్షుడి మార్పు ఉండదని బిజెపి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్‌చుగ్ కూడా తేల్చి చెప్పారు. బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని వెల్లడించారు. మళ్లీ మళ్లీ అధ్యక్షుడి మార్పుపై ప్రచారం సరికాదని పేర్కొన్నారు. స్పష్టత ఇచ్చాక ఎందుకు ప్రచారం జరుగుతుందో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఇలా ఉండగా, గత ఏడాది కాలంగా తనను రాష్ట్ర అధ్యక్షుడిగా మారుస్తున్నారంటూ వస్తున్న వార్తలు సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్రగా బండి సంజయ్ ఆరోపించారు.  ‘‘తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై తరుణ్ చుగ్ సహా జాతీయ నాయకులు అనేకసార్లు స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా నన్ను మారుస్తున్నారంటూ కొన్ని ఛానళ్లు పదేపదే వార్తలు రాస్తున్నాయి. ఆ వార్తలు చూసి చూసి మా కార్యకర్తలకు అలవాటైపోయింది. రాసి రాసి మీకు అలవాటైనట్లుంది” అంటూ కొట్టిపారేశారు.