కమ్మ, వెలమ సంఘాలకు భూ కేటాయింపుపై హైకోర్టు స్టే

కమ్మ, వెలమ సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం భూముల కేటాయించడంపై గతంలోనే కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ హైకోర్టు తాజాగా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవో సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది. అణగారిన వర్గాలకు ఇస్తే అర్థం చేసుకోవచ్చు కానీ, బలమైన కుల సంఘాలకు ఎందుకని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.
 
సర్కార్ నిర్ణయంపై స్టే విధించిన కోర్టు విచారణ ఆగస్టు 2కి వాయిదా వేసింది.  ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో తెలంగాణ ప్రభుత్వం కమ్మ, వెలమ సంఘాలకు ఖానామెట్ లో ఐదు ఎకరాల చొప్పున భూమి కేటాయించింది. ఈ రెండు కులాలకు భూ ములు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డు ప్రొఫెసర్‌ వినాయక్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు.
 
 దీనిపై జూన్ 15న కూడా కోర్టు విచారించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలా భూములు కేటాయించడం కూడా ఒక విధమైన కబ్జానే అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా సాయిసింధు ఫౌండేషన్ కు ప్రభుత్వం కేటాయించిన భూమి రద్దును హైకోర్టు గుర్తు చేసింది.
 
21వ శతాబ్దంలో కూడా కులాల ఆధారిత విభజన చూస్తుంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? అని ప్రశ్నించింది. ఇలాంటి ఆలోచనలు చాలా సంకుచితమైనవని వ్యాఖ్యానించింది. కుల రహిత సమాజానికి కృషి చేయాల్సి ఉండగా దానికి విరుద్ధంగా కులాలను ప్రోత్సహించేలా భూములు కేటాయించడం అసంబద్ధమంది. హైటెక్‌ రాష్ట్రంలో ఇదేం విధానమని ఆక్షేపించింది.
 
కులరహిత సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కొన్ని రాష్ట్రాల్లో కుల సంఘాలే భూములను స్వయంగా మార్కెట్‌ ధరకు కొనుగోలు చేసి ఆస్పత్రులు నిర్మించాయని హైకోర్టు గుర్తు చేసింది. ప్రభుత్వాలు ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.
 
ఫార్మా సిటీ కోసం దేవాదాయ భూములపై స్టే

కాగా, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నంది వనపర్తి, సింగారం గ్రామాల్లో హైదరాబాద్‌ ఫార్మాసిటీ కోసం దేవాదాయశాఖకు చెందిన 1022.32 ఎకరాల భూసేకరణపై స్టేటస్ కో విధించింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యాచారం మండలంలోని ఓంకారేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూమిని సేకరించేందుకు అనుమతినిస్తూ గతంలో సింగిల్‌జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ యాచారం మండలానికి చెందిన ఎం.జంగయ్య, ఎ.దేవోజి అనే ఇద్దరు రైతులు అప్పీలు దాఖలు చేశారు.

దీనిపై మంగళవారం జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌, జస్టిస్‌ పుల్లా కార్తీక్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దేవాదాయశాఖ భూములను తీసుకోవాలనుకుంటే ముందస్తు అనుమతి అవసరమని డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసినపుడు సింగిల్‌ జడ్జి ఎలా విచారించి ఉత్తర్వులు జారీ చేశారని కోర్టు ప్రశ్నించింది. దేవాదాయశాఖకు చెందిన భూసేకరణపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.