పుతిన్ ప్రిగోజిన్‌ను పురుగులా నలిపేసేవాడు

రష్యాపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ వెనక్కి తగ్గకుంటే ప్రాణాలతో ఉండేవారు కాదని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో తాజాగా స్పష్టం చేశారు. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వాగ్నర్ చీఫ్ ను పురుగును నలిపినట్లు నలిపేసేవాడని చెప్పుకొచ్చారు. వాగ్నర్ చీఫ్, రష్యా అధ్యక్షుడి భవనం క్రెమ్లిన్ మధ్య లుకషెంకో మధ్యవర్తిత్వం నిర్వహించిన విషయం తెలిసిందే.

తిరుగుబాటు ప్రకటించి మాస్కో వైపు తన బలగాలను నడిపించిన ప్రిగోజిన్ ను నిలువరించింది లుకషెంకోనే. అయితే, చర్చల సందర్భంగా ఏం జరిగిందనే విషయాన్ని లుకషెంకో తాజాగా బయటపెట్టాడు. ప్రిగోజిన్ తిరుగుబాటు ప్రకటన తర్వాత వాగ్నర్ గ్రూపును నామరూపాల్లేకుండా చేయాలని పుతిన్ నిర్ణయించుకున్నాడని లుకషెంకో చెప్పారు. రష్యాలో పరిస్థితులను అర్థం చేసుకుని తానే కల్పించుకున్నానని, తొందరపడవద్దంటూ పుతిన్ కు నచ్చచెప్పానని వివరించారు.

ప్రిగోజిన్ తో మాట్లాడినప్పుడు క్షమించమంటూ మొదలుపెట్టిన ప్రిగోజిన్ తొలి అర్ధ గంట పాటు విపరీతమైన తిట్లతో తన సమస్యలను ఏకరువు పెట్టాడని చెప్పారు. తాను సర్దిచెప్పి తిరుగుబాటును నిలువరించానని, పుతిన్ తమను చంపేస్తాడని భయాందోళనలు వ్యక్తం చేసిన ప్రిగోజిన్ కు ధైర్యం చెప్పానని లుకషెంకో పేర్కొన్నారు. బెలారస్ లో తాత్కాలికంగా ఆశ్రయం ఇచ్చేందుకు తాను సమ్మతించాక ప్రిగోజిన్ రాజీకి ఒప్పుకున్నాడని వివరించారు.

రక్తపాతం వద్దనుకునే క్షమాభిక్ష

కాగా, రుష్యాలో కిరాయి సైన్యం(వాగ్నర్‌ గ్రూప్‌) అధినేత ప్రిగోజిన్‌ లేవనెత్తిన తిరుగుబాటును అణచివేసే విషయంలో రక్తపాతం వద్దనుకునే అతనికి క్షమాభిక్ష ప్రసాదించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు. రష్యాలో తిరుగుబాటు ముగిసిన తర్వాత ఆయన తొలిసారి టెలివిజన్‌లో జాతినుద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా పాశ్చాత్య దేశాలు, ఉక్రెయిన్‌పై మండిపడ్డారు. ‘‘తిరుగుబాటు మొదలైనప్పటి నుంచి రక్తపాత నివారణ దిశలోనే నా చర్యలున్నాయి. కానీ, పాశ్చాత్య దేశాలు, ఉక్రెయిన్‌లోని నియో నాజీలు మాత్రం రష్యాలో రక్తపాతాన్ని కోరుకున్నారు. రష్యా సైనికులు పరస్పరం ప్రాణాలను తీసుకోవాలని ఆకాంక్షించారు” అని ఆరోపించారు.
కానీ, దేశభక్తులైన రష్యా ప్రజలు ఓపికతో ఎదురు చూశారని, ప్రభుత్వానికి సంఘీభావం తెలిపారని అంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. వాగ్నర్‌ సభ్యులను దేశభక్తులని కొనియాడుతూ వారంతా రష్యా సైన్యంలో లేదా ఇతర ప్రభుత్వ సంస్థల్లో చేరవచ్చని స్పష్టం చేశారు. లేదంటే బెలారస్‌కు వెళ్లవచ్చని సూచించారు.
మరోవైపు ప్రిగోజిన్‌ ఎక్కడున్నాడనేది ఇంకా సమాధానం లేని ప్రశ్నగా ఉంది. మరోవైపు ప్రిగోజిన్‌ వాడే బిజినెస్‌ జెట్‌ మంగళవారం బెలారస్‌లోని మిన్స్‌ నగరంలో ల్యాండ్‌ అయిందని వార్తలు వచ్చాయి.  ప్రిగోజిన్‌ నేతృత్వంలో ఇటీవల జరిగిన సాయుధ తిరుగుబాటుపై క్రిమినల్‌ విచారణను మూసి వేశామని రష్యా అధికారులు మంగళవారం వెల్లడించారు. తిరుగుబాటులో పాల్గొన్న వారందరిపైనా ఎలాంటి దర్యాప్తు ఉండదని తెలిపారు. నేర కార్యకలాపాలను నిలిపేయడంతో తిరుగుబాటుదారులపై దర్యాప్తుకు స్వస్తి పలుకుతున్నట్టు ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ తెలిపింది.