ఆస్కార్ జ్యూరీ సభ్యులుగా చరణ్, ఎన్టీఆర్

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’  చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గతేడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గ‌త ఏడాది మార్చి 24న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న్ క్రియేట్ చేసి రూ.1100 కోట్ల‌కు పైగానే వ‌సూళ్ల‌ను సాధించింది.

ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. అంతేకాదు, భారతీయ సినిమా ఖ్యాతిని ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆస్కార్ వేదిక వరకూ తీసుకెళ్లింది. ఈ సినిమాలో కీర‌వాణి కంపోజ్ చేసిన‘నాటు నాటు’ పాట ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.

తాజాగా మరోసారి భారతీయ సినీ ప్రేక్షకులు గర్వించే క్షణం ‘ఆర్ఆర్ఆర్’తో వరించింది. ఆస్కార్ గెలుచుకున్న ఈ చిత్ర యూనిట్ కు ఇప్పుడు అకాడమీ జ్యూరీ మెంబర్స్ గా స్థానం దక్కింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే ‘ద అకాడమీ ఆఫ్ మోషనల్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ కొత్తగా ఆస్కార్ కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించింది.

 ఆ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో ‘ఆర్ఆర్ఆర్’ టీంకు చెందిన ఆరుగురు ఉండటం విశేషం. స్టార్ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తోపాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ లకు ఈ కమిటీలో స్థానం దక్కింది.

ఇక ప్రముఖ దర్శకుడు మణిరత్నం, బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్స్‌ కరణ్‌ జోహార్‌, సిద్ధార్థ్‌ రాయ్ కూడా జ్యూరీ మెంబర్స్‌గా చోటు దక్కించుకున్నారు.  ఆస్కార్ జ్యూరీ మెంబర్లుగా తారక్, చరణ్ లకు స్థానం లభించడంతో మెగా, నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా నటులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక, కొత్తగా చేరిన మెంబర్స్ తో కలిపి ప్రపంచవ్యాప్తంగా అకాడమీ జ్యూరీ లిస్టులో 10,817 మంది ఉన్నారు. 96వ అకాడమీ అవార్డ్స్ లో మాత్రం 9,375 మంది మాత్రమే ఓటు వేయబోతున్నారని తెలుస్తోంది. 96వ అకాడమీ అవార్డ్స్ వేడుక‌ను వ‌చ్చే ఏడాది మార్చి 10న నిర్వ‌హించ‌బోతున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి పని చేసిన బృందంలో ఆరుగురికి ఆస్కార్‌ కమిటీలో చోటు దక్కించుకోవడం పట్ల దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి  ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఈ ఏడాది ఆస్కార్‌ కమిటీలోకి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం నుంచి ఆరుమంది సభ్యులకు ఆహ్వానం అందడం చాలా గర్వంగా ఉంది. తారక్‌, చరణ్‌, పెద్దన్న (కీరవాణి), చంద్రబోస్‌, సెంథిల్‌, సాబు సిరిల్‌ అందరికీ అభినందనలు తెలుపుతున్నా. భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ అహ్వానం అందిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు’’ అని రాజమౌళి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.