రైతుల కోసం రూ. 3.7 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ

దేశంలో ఈనాటికీ అత్యధిక భాగం జనాభా ఆధారపడ్డ వ్యవసాయం కోసం, రైతుల కోసం రూ. 3.7 లక్షల కోట్ల విలువైన భారీ ప్యాకేజికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ వినూత్న పథకాల ప్యాకేజిని ఆమోదించింది. రూ.3,70,128.7 కోట్ల విలువైన ఈ ప్యాకేజి ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రైతుల శ్రేయస్సు, ఆర్థిక మెరుగుదలపై దృష్టి సారించింది.

ఈ కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు సహజ, సేంద్రీయ వ్యవసాయాన్ని బలోపేతం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే భూసారాన్ని సహజ పద్ధతుల్లో పునరుజ్జీవింపజేస్తాయని, ఫలితంగా ఉత్పాదకత పెరిగి ఆహార భద్రతను సుస్థిరం చేసుకోవచ్చని పేర్కొంది. యూరియాపై సబ్సిడీ భారం పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు బడ్జెట్ పెంచుకుంటూ వస్తుంది.

బుధవారం నాటి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో యూరియా సబ్సిడీ కోసం రూ.3,68,676.7 కోట్లు కేటాయించింది. దేశంలో రైతులు వినియోగించే యూరియాలో సింహభాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.  అయితే దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంపొందిస్తూ స్వయం సమృద్ధి స్థాయి సాధించే వరకు ఈ సబ్సిడీని కొనసాగించనుంది.

పన్నులు, నీమ్ కోటింగ్ ఛార్జీలు మినహాయించి యూరియా బస్తా (45 కేజీలు) రూ.242 కు రైతులకు యూరియా నిరంతరం లభ్యమయ్యేలా ఈ పథకాన్ని రూపొందించింది. సబ్సిడీ లేకుండా ఇదే బస్తాకు వాస్తవ ధర రూ. 2,200గా ఉంటుందని వెల్లడించింది. కేబినెట్ ఆమోదించిన ప్యాకేజి ద్వారా 2022-23 నుంచి 2024-25 వరకు యూరియా సబ్సిడీ కోసం కేటాయింపులు జరిపింది.

ఇది 2023-24 ఖరీఫ్ సీజన్ కోసం ఇటీవల ఆమోదించిన రూ.38,000 కోట్ల పోషకాల ఆధారిత సబ్సిడీకి అదనం అని కేంద్రం పేర్కొంది. ఎప్పటికప్పుడు మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు (ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వంటివి), పెరిగిన ముడి పదార్థాల ధరల కారణంగా ఎరువుల ధరలు గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అనేక రెట్లు పెరుగుతున్నాయి.

కానీ భారత ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని పెంచడం ద్వారా మార్కెట్లో రైతులకు పాత ధరకే ఎరువులు అందుబాటులో ఉండేలా చూస్తోంది. తద్వారా అంతర్జాతీయ పరిణామాల ప్రభావం రైతులపై పడకుండా కేంద్ర ప్రభుత్వమే ఆ భారాన్ని మోస్తోంది. ఎరువుల సబ్సిడీ కోసం 2014-15లో రూ. 73,067 కోట్లు ఖర్చు చేయగా, 2022-23లో ఆ భారం రూ. 2,54,799 కోట్లకు చేరుకుంది.

నానో యూరియా వ్యవస్థ బలోపేతం

2025-26 నాటికి 195 లక్షల మెట్రిక్ టన్నుల సంప్రదాయ యూరియాకు సమానమైన 44 కోట్ల బాటిళ్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఎనిమిది నానో యూరియా ప్లాంట్లు ఏర్పాటవుతాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నానో ఎరువులు నియంత్రిత పద్ధతిలో పోషకాలను విడుదల చేస్తాయి. ఇది అధిక పోషక వినియోగ సామర్థ్యం కలిగి ఉండడంతో పాటు రైతులకు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి.

నానో యూరియాను ఉపయోగించడం వల్ల పంట దిగుబడిలో పెరుగుదల కూడా ఉంటుందని కేంద్రం పేర్కొంది. దేశంలో కొత్తగా 6 యూరియా ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు, పునరుద్ధరణతోపాటు రాజస్థాన్ కోటాలో చంబల్ ఫెర్టీ లిమిటెడ్‌, పశ్చిమ బెంగాల్‌లోని మాటిక్స్ లిమిటెడ్, తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, జార్ఖండ్‌లోని సింద్రీ, బిహార్‌లోని బరౌనీ ఎరువుల కర్మాగారాల్లో 2018 నుంచి యూరియా ఉత్పత్తి పెరిగింది.

ఇవి యూరియా ఉత్పత్తిలో దేశాన్ని ఆత్మనిర్భరత దిశగా తీసుకెళ్తున్నాయి. దేశీయ యూరియా ఉత్పత్తి 2014-15లో 225 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2021-22 నాటికి 250 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. 2022-23లో ఉత్పత్తి సామర్థ్యం 284 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. నానో యూరియా ప్లాంట్‌లతో పాటు ఈ సాంప్రదాయ యూరియా ఉత్పత్తి పెరగడంతో ప్రస్తుత దిగుమతి భారం తగ్గి చివరకు 2025-26 నాటికి దేశం స్వయం సమృద్ధి సాధిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఎల్లప్పుడూ మానవాళికి పుష్కలమైన జీవనోపాధిని అందిస్తున్న భూమాతను రసాయనాలతో కలుషితం చేయకుండా భాసారాన్ని పెంపొందించడం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం ప్రణామ్ పథకాన్ని ప్రారంభించింది. వ్యవసాయంలో రసాయన ఎరువుల సమతుల్య, స్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి సహజమైన మార్గాలకు తిరిగివెళ్లే దిశగా ఈ పథకం ఉపయోగపడుతుంది. గోబర్ధన్ ప్లాంట్ల నుండి సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించడానికి మార్కెట్ అభివృద్ధి సహాయం (ఎండిఏ) కోసం రూ.1451.84 కోట్లు నిధులను ఆమోదిస్తూ బుధవారం కేబినెట్ నిర్ణయం తీసుకుంది.