ఏపీలో రూ. 450 కోట్లతో ఎన్‌ఎండీసీ బంగారం తవ్వకాలు

ఏపీలో రూ. 450 కోట్లతో ఎన్‌ఎండీసీ బంగారం తవ్వకాలు

కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ను (కేజీఎఫ్‌)ను మూసివేయడంతో భారతదేశంలో బంగారం ఉత్పత్తి దాదాపు ఆగిపోయిందనే చెప్పాలి. కానీ, ఇప్పుడు మళ్లీ దేశంలోని గనుల నుంచి బంగారం తవ్వకాలు ప్రారంభించేందుకు నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండిసి) పూర్తి స్థాయిలో సన్నాహాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీలో బంగారు గనులు తవ్వనున్నారు.

ఖనిజాల ఉత్పత్తిలో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా చిగురుకుంటలో బంగారు తవ్వకాల కోసం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా తొలి దశలో రూ.450 కోట్ల మేర పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబర్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్‌ఎండీసీ ఇప్పటికే లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌పై సంతకం చేసింది.

అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత తవ్వకాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. పర్యావరణ మంత్రిత్వ శాఖల నుండి అనుమతులతో సహా అన్ని ప్రభుత్వ అనుమతులను పొందడం కోసం వేగవంతమైన చర్యలు చేపడుతున్నారు.

మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన బంగారు గనులు మూతపడడంతో అనేక మంది కార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి గోడు అరణ్యరోదనగా మారింది. ఈక్రమంలోనే సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఈ గనులను తెరిపించే దిశగా అడుగులు వేశారు.  గుడుపల్లె మండలం బిసానత్తం గనిని 1968లో, దశాబ్దం తర్వాత చిగురుకుంట గనిని 1978లో ఎంఈసీఎల్‌ సంస్థ ప్రారంభించింది.

ఈ సంస్థ పదేళ్లపాటు క్వార్జ్‌ (బంగారు ముడి పదార్థం) వెలికి తీసి కేజీఎఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌)లోని బీజీఎంఎల్‌ (భారత్‌ గోల్డ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌)కు అందజేస్తూ వచ్చింది. కాలక్రమేణా ఎంఈసీఎల్‌ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో గనులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీజీఎంఎల్‌ 1982లో కొనుగోలు చేసింది.

అప్పటి నుంచి 19 సంవత్సరాల పాటు 2001 జనవరి 15 వరకు బంగారు ముడి ఖనిజం వెలికి తీసే పనిని చేపట్టింది. దీంతో గనులు లాభాల బాట పట్టాయి. కేజీఎఫ్‌లోని బీజీఎంఎల్‌ నిర్వహిస్తున్న చాంపియన్‌ గని నష్టాల్లో పడింది. కొంత మంది స్వార్థపరులు చిగురుకుంట, బిసానత్తం గనులు నష్టాల్లో సాగుతున్నట్లు తప్పుడు లెక్కలు చూపించడంతో లాక్‌అవుట్‌ అయ్యాయి.

మూతపడ్డ గనులను కేంద్ర ప్రభుత్వం పదేళ్ల తర్వాత ఇక్కడ బంగారు కోసం అన్వేషించాలని మైసూరుకు చెందిన జియో సంస్థను 2011లో ఆదేశించింది. జియో సంస్థ మల్లప్పకొండ, బిసానత్తం, చిగురుకుంటలోని 19 కి.మీ. మేర పరిశోధనలు చేసి 263 హెక్టార్లను ఎంపిక చేసింది. 150 బోర్లు డ్రిల్‌ చేసి బంగారం లభ్యతపై అన్వేషణ చేపట్టింది.

ఇక్కడ దొరికిన సల్ఫేట్‌ మట్టిని బెంగళూరుకు తరలించి ల్యాబ్‌లో పరీక్షించారు. పరీక్షల్లో చిగురుకుంట, బిసానత్తం ప్రాంతాల్లో ఇంకా బంగారం ఉన్నట్లు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చి, ఆ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ బిడ్‌లకు ఆదాని, వేదాంత వంటి బడా కంపెనీలు పోటీ పడినా, ఆయా కంపెనీలను తోసిపుచ్చుతూ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ టెండర్లను దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

263 హెక్టార్లలో విస్తరించిన చిగురుకుంట, బిసానత్తం గనుల్లో ఇప్పటికీ 18 లక్షల టన్నుల బంగారం ముడి ఖనిజం ఉండవచ్చని ఎన్‌ఎండీసీ అధికారుల అంచనా. ఒక టన్ను ముడి పదార్థం నుంచి 5.5 గ్రాముల బంగారం లభిస్తుంది. మొత్తం 8.5 టన్నుల బంగారం ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించుకుని, రూ.450 కోట్ల వరకు సంస్థ ఖర్చు పెట్టనుంది. గనుల ప్రదేశంలోనే బంగారుశుద్ధి ప్లాంటుకు ఎన్‌ఎండీసీ సంస్థ సన్నాహాలు ప్రారంభించింది.