జులై 24న పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

జులై 24న పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించింది. గోవా, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌లోని రాజ్యసభ సభ స్థానాలకు షెడ్యూల్‌ను మమంగళవారం జారీ చేసింది. ఇందులో అత్యధికంగా బెంగాల్‌లో ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 

గుజరాత్‌లో మూడు, గోవాలో ఒక స్థానం ఖాళీ కానున్నది. ఆయా స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ జులై 6న విడుదలవుతుందని తెలిపింది. నామినేషన్లకు గడువు జులై 13, ఉపసంహరణకు జులై 17న చివరి తేదీ అని తెలిపింది. 24న ఎన్నికలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఇదిలా ఉండగా.. ఆయా రాష్ట్రాల నుంచి ఎన్నికైన పది మంది సభ్యుల పదవీకాలం ఈ ఏడాది జులై – ఆగస్ట్‌ మధ్య పదవీకాలం ముగియనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కేంద్రమంత్రి జైశంకర్‌ పదవీకాలం ముగియనున్నది. ప్రస్తుతం ఆయన గుజరాత్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

గోవా నుంచి వినయ్‌ డీ టెండూల్కర్‌, గుజరాత్‌ నుంచి కేంద్రమంత్రి సుబ్రహ్మణ్య జైశంకర్ కృష్ణస్వామి‌, దినేశ్‌చంద్ర అనవాదియ, లోఖండ్‌వాలా జుగల్‌సిన్హ్ మాథుర్‌జీ, పశ్చిమ బెంగాల్‌ నుంచి డెరెక్‌ ఒబ్రియెన్‌, దోలాసెన్‌, ప్రదీప్‌ భట్టాచార్య, సుశ్మిత దేవ్‌, శాంతి ఛత్రి, సుఖేందు శేఖర్‌ రాయ్‌ పదవీకాలం ముగియనున్నది.