కూనో నేషనల్ పార్క్‌లో చీతాల మధ్య ఘర్షణ

ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఇటీవలే నమీబియా, ఆఫ్రికాలనుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లాలో గల కూనో నేషనల్ పార్క్ లో విడిచిపెట్టిన విషయం తెలిసిందే. అయితే అందులో ఇప్పటికే కొన్ని మరణించాయి. కాగా, తాజాగా వాటిలోని కొన్ని పోట్లాడుకుంటున్నాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన గౌరవ్, శౌర్య, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన అగ్ని, వాయు చీతాలు తీవ్రంగా పోట్లాడుకున్నాయి.
సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పార్క్‌లోని ఫ్రీ రేంజ్ ఏరియాలో నాలుగు చీతాలు పరస్పరం తలపడినట్లు అధికారులు చెప్పారు. చీతాల మధ్య ఘర్షణను గమనించిన అధికారులు వాటిని చెదరగొట్టేందుకు పెద్ద ఎత్తున టపాసులు, సైరన్ లు మోగించారు. ఈ పోరులో ఒక చీతా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన చీత అగ్నికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని, దాని ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.

అయితే, చీతాల మధ్య ఇలాంటి తగాదాలు సహజమే అని డివిజనల్ అటవీ అధికారి పీకే వర్మ తెలిపారు. కాగా, దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గదేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియానుంచి మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్కుకు తీసుకొచ్చారు.

రెండో దశలో ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 12 చీతాలను కునో నేషనల్ పార్క్‌కు తరలించారు. అయితే ఆ 20 చీతాల్లో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆరు చీతాలు మరణించాయి. మరణించిన వాటిలో మూడు కూనలు కూడా ఉన్నాయి.