మణిపూర్ లో అల్లర్లకు మయన్మార్ నుండి ఆయుధాలు!

మణిపూర్ లో సుమారు రెండు నెలలుగా హింసాయుత సంఘటనలు కొనసాగుతూ ఉండడం, అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా పూర్తి ఫలితాలు రాకపోవడానికి పొరుగున ఉన్న మయన్మార్ నుండి ఆయుధాలు, ఇతరత్రా ప్రోత్సాహకాలు లభించడమే కారణమనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

తాజాగా అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న నలుగురు వ్యక్తులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. దానితో పొరుగున ఉన్న మయన్మార్ నుంచి ఈ ఆయుధాలను తీసుకువచ్చ మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలను మరింత పెంచుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి.

ఈ మేరకు అక్రమ ఆయుధ సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. దీనిలో ఐఆర్‌బీ దళానికి చెందిన సిబ్బంది ఒకరు ఉండటం గమనార్హం. ఇంఫాల్‌ తూర్పు జిల్లాలో అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్నారనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు అందింది. దీంతో రంగంలోకి భద్రతా బలగాలు దిగాయి.

ఇంటపాల్‌ ఇస్ట్ డిస్ట్రిక్ట్‌ కమాండో బృందం, హెయిన్‌గాంగ్‌ పోలీసు, 16వ జాట్‌ రెజిమెంట్‌లు సంయుక్తంగా గాలింపు ఆపరేషన్లను చేపట్టాయి.  ఈ క్రమంలోనే భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నాయి. వీటితోపాటు రూ.2.5 లక్షల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, రెండు కార్లను సీజ్ చేశాయి. వేర్పాటువాద గ్రూపులకు చెందిన వారు మూడు వాహనాల్లో మయన్మార్‌కు వెళ్లి ఈ ఆయుధాలను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.

ఈ నెలలోనే మయన్మార్ నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్న లోడు మణిపూర్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. మయన్మార్‌ – చైనా సరిహద్దుల్లోని ఆయుధ బ్లాక్‌ మార్కెట్‌ నుంచి ఈ ఆయుధాలను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు.