సైన్యాన్ని అడ్డుకుంటున్న మణిపూర్ మహిళలు

దాదాపు రెండు నెలల నుంచి హింసాత్మక సంఘటనలతో అట్టుడికిపోతున్న మణిపూర్‌ రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు వచ్చిన సైన్యాన్ని స్థానిక మహిళలు అడ్డుకుంటున్నారు. సైనిక వాహనాలు నడవకుండా పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లను తవ్వేస్తున్నారు. వీరి రక్షణతో హింసాత్మక నిరసనకారులు తప్పించుకుంటున్నారు.
 
దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణకు తమకు సహకరించాలని సైన్యం ట్విటర్ వేదికగా ప్రజలందరినీ కోరింది. మణిపూర్‌ రాష్ట్రంలో మే నెల నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గృహదహనాలు, వాహనాలను తగులబెట్టడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.
 
శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం భారత సైన్యంలోని స్పియర్స్ కార్ప్స్ ఈ రాష్ట్రానికి వచ్చింది. కానీ స్థానికులు వీరికి సహకరించడం లేదు. ఉద్దేశపూర్వకంగానే అనేక రకాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో స్పియర్స్ కార్ప్స్ మంగళవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, విషమ పరిస్థితుల్లో ఉన్నవారి ప్రాణాలు, ఆస్తులను సకాలంలో కాపాడవలసి ఉంటుందని, ప్రజలు సమర్థనీయంకాని రీతిలో అడ్డంకులు సృష్టించడం వల్ల తాము సకాలంలో స్పందించడానికి విఘాతం కలుగుతుందని తెలిపింది.
 
రెండు రోజుల క్రితం తూర్పు ఇంఫాల్‌లోని ఇథం అనే గ్రామంలో సైన్యం, మహిళా నిరసనకారుల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. మహిళలు సైన్యాన్ని నిరోధించడం వల్ల 12 మంది తీవ్రవాదులు తప్పించుకుపోయారు. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో శాంతిభద్రతల పునరుద్ధరణకు తమకు సహకరించాలని రాష్ట్ర ప్రజలను సైన్యం కోరింది.
మణిపూర్‌లోని మహిళా ఉద్యమకారులు ఉద్దేశపూర్వకంగానే సైన్యం ప్రయాణించే మార్గాల్లో అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపింది. భద్రతా దళాల కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తున్నారని తెలిపింది. ఇబ్బందుల్లో ఉన్నవారిని కాపాడటానికి, వారి ఆస్తులను రక్షించడానికి భద్రతా దళాలు సకాలంలో స్పందించవలసి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ విధంగా అడ్డంకులు సృష్టించడం వల్ల భద్రతా దళాల కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందని తెలిపింది. మణిపూర్ రాష్ట్రానికి సహాయపడటానికి తమకు సహాయపడాలని, శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం తాము చేసే ప్రయత్నాలకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని భారత సైన్యం కోరుతోందని వివరించింది.

కాగా, ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా చేసుకుని విధులకు గైర్హాజరయ్యే ప్రభుత్వోద్యోగులపై చర్యలు తీసుకోవాలని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. విధులకు హాజరుకాకపోతే, వేతనం చెల్లించరాదని నిర్ణయించినట్లు తెలిపింది. రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను జూన్ 30 మధ్యాహ్నం 3 గంటల వరకు నిషేధించారు.