సిద్ధాంత నిబద్ధత, అరుదైన వ్యక్తిత్వం పివి చలపతిరావు

నల్లు ఇంద్రసేనారెడ్డి,
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ పక్ష నేత
 
* జననం జూన్ 26, 1936, మరణం జనవరి 1, 2023
ఆ తరం జనసంఘ్, బిజెపి నాయకులలో నాకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సిద్ధాంతం పట్ల నిబద్ధత విషయంలో, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేపట్టినా కేవలం పార్టీ ప్రయోజనాలనే దృష్టిలో ఉంచుకొనే నేత అంటే నాకు శ్రీ పివి చలపతిరావు గారే మొదట గుర్తుకు వస్తారు.  బహుశా, ఆ రోజులలో రాష్ట్ర అధ్యక్షునిగా నేటి ఆంధ్ర ప్రదేశ్ లో విస్తృతంగా పర్యటనలు జరిపి, కార్యకర్తలను ఉత్తేజ పరచిన మొదటి నాయకుడు ఆయనే అని చెప్పవచ్చు. అంతకు ముందు జనసంఘ్ రోజులలో కూడా మరొకరు లేరు.
 
శ్రీ చలపతిరావు గారు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న సమయంలోనే నేను మొదటిసారి ఎమ్యెల్యేగా 1983లో గెలుపొందాను. ఆ సమయంలో ఆయన నుండే నేను బి ఫారం తీసుకున్నాను. తిరిగి నేను ఎమ్యెల్యేగా రెండోసారి గెలుపొందిన 1985లో సహితం ఆయన నుండే బి ఫారం తీసుకున్నాను. ఆయన ఇచ్చిన బి ఫారంలతోనే రెండు సార్లు నేను ఎమ్యెల్యేగా ఎన్నికయ్యాను.
 
ఆ రోజుల్లో పార్టీలో విశేష ప్రాచుర్యం పొందిన శ్రీ డి ఎస్ పి రెడ్డి, శ్రీ జూపూడి యజ్ఞనారాయణ, శ్రీ వి రామారావు వంటి పలువురు నాయకులు ఉన్నప్పటికీ సైద్ధాంతిక నిబద్దత, నియమబద్దంగా పనిచేసిన నాయకుడిగా ఆయనే కనిపించేవారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి చర్యలకు పాల్పడినా సంస్థ ప్రయోజనాలు, పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉంటూ ఉండెడిది. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించేవారు. ఆయనది చాలా అరుదైన వ్యక్తిత్వం.
 
ముఖ్యంగా తమ ప్రాంత అభివృద్ధి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు.  పార్టీ నేతగానే కాకుండా, కార్మిక నాయకుడిగా సహితం ఆయన విశేషంగా ప్రఖ్యాతి పొందారు. నియమబద్ధ నేతగా ఎందరో కార్మికుల ప్రేమాభిమానాలను పొందారు. వ్యక్తిగతంగా ఎంత సౌమ్యుడిగా ఉంటారో, ఎంత స్నేహభావంతో వ్యవహరిస్తారో విధానాలపరంగా, సిద్ధాంత పరంగా అంత రాజీలేని వైఖరి ప్రదర్శించేవారు.
 
దక్షిణాది రాష్ట్రాలలోని బిజెపికి మొట్టమొదటి మేయర్ గా విశాఖపట్నంలో శ్రీ ఎన్ ఎస్ ఎన్ రెడ్డి గెలుపొందడంతో ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. బిజెపి సొంత బలంతో ఒక ప్రముఖ నగరంలో మొదటి మేయర్ పదవిని కైవసం చేసుకోవడం ఆ రోజులలో ఒక చరిత్ర సృష్టించటమే. బీజేపీలో జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఎప్పుడూ బిజెపి బలోపేతం కావాలనే ఆర్ద్రత ఆయనలో కనిపిస్తూ ఉండెడిది.
 
సహచర పార్టీ నాయకులతో, కార్యకర్తలతో ఎంతో ఆత్మీయతతో, స్నేహపూర్వకంగా వ్యవహరించేవారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారితో సహితం సామరస్యంగా వ్యవహరించేవారు. ఆయనలో ఎన్నడూ కక్షసాధింపు ధోరణులు చూడలేదు. పట్టుబట్టి తాను అనుకున్న వ్యక్తిని పదవులలో కుర్చోపెట్టాలని, తన మనుషులే ఉండాలని భీష్మించుకోవడం కూడా చూడలేదు.
 
సమిష్టి అభిప్రాయాలకు, నిర్ణయాలకు ఎంతో విలువ ఇచ్చేవారు. ఏనాడూ వ్యక్తిగత అజెండాతో పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించలేదు. కొన్ని సార్లు అవమానాలు ఎదురైనా, ఆటుపోట్లు ఎదురైనా చిరునవ్వుతోనే స్వీకరించేవారు. ఎవరిని నిందించడం, దూషించడం యెరుగము. ఆయన ఎవరినైనా కోపగించుకోవడం, ఆగ్రవేశాలు వ్యక్తం చేయడం ఎప్పుడూ చూడలేదు.
 
పార్టీలో ఏదైనా వివాదం ఏర్పడితే నిర్మొహమాటంగా తాను వాస్తవం అనుకున్న విషయాలను చెప్పేవారు. అంతేగాని వత్తిడులకు, మొహమాటాలకు లొంగి అవాస్తవాలను ముందుంచేవారు కాదు.  ఉదాహరణకు 1994లో నేను ఎమ్యెల్యేగా ఓటమి చెందినప్పుడు కొందరు పార్టీ వారీ నాకు వ్యతిరేకంగా పనిచేసారని ఫిర్యాదు చేసాను. అప్పుడు శ్రీ పివి చలపతిరావు, డా. రాజేశ్వరరావు గార్లతో ఒక కమిటీ వేశారు. వారిద్దరూ నేను చేసిన ఆరోపణలను సమర్థిస్తూ తమ నివేదిక ఇచ్చారు.
 
ఆయన ఏనాడూ పదవుల కోసం, గుర్తింపులు కోసం వెంపర్లాడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విశేషంగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వారిలో కేవలం ఇద్దరే జాతీయ కార్యవర్గంలో సభ్యులుగా పనిచేయలేదు. వారిలో ఒకరు శ్రీ పివి చలపతిరావు కాగా, మరొకరు శ్రీ సి జంగారెడ్డి. శ్రీ చలపతిరావు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో, శ్రీ జంగారెడ్డి ఎంపీ హోదాలో మాత్రమే జాతీయ కార్యవర్గంలో ఉండగలిగారు.
 
ఎమర్జెన్సీ సమయంలో ఎమ్యెల్సీగా అరెస్ట్ కాకుండా బయటే ఉంటూ జనసంఘ్ కార్యకలాపాలు కాకుండా, ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్దరణకు సాగించిన పోరాటంలో సహితం ఆయన కీలక భూమిక వహించారు. మిగిలిన పార్టీ నాయకులందరూ దాదాపుగా అరెస్ట్ అయి జైళ్లలో ఉండడంతో ఆయన ఎన్నో బాధ్యతలు వహించవలసి వచ్చింది.
 
డా. నీలం సంజీవరెడ్డి వంటి పలువురు ఇతర పార్టీలకు చెందిన నాయకులను సహితం ఈ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో విశేషంగా కృషి చేశారు. ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులు విశేషంగా ప్రయత్నం చేశారు.  చివరకు ఎన్నికలు ప్రకటించిన తర్వాత, అనకాపల్లి నుండి లోక్ సభ ఎన్నికలలో నామినేషన్ వేయడానికి ముందుగా అక్కడ జరిగిన బహిరంగసభలోనే పోలీసులు అరెస్ట్ చేయగలిగారు.
 
1996-97లో బిజెపి రాష్త్ర శాఖ `ఒక ఓటు – రెండు రాష్ట్రాలు’ పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కోరుతూ తీర్మానం చేసినప్పుడు “కనీసం మీరన్నా (తెలంగాణ ప్రాంతంలో బిజెపి) పెరగండి” అంటూ ఎంతో ఆత్మీయంగా చెప్పారు. అంటే ఆయనలో ఎప్పుడూ పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుందో అనే తపన కనిపిస్తూ ఉండెడిది.