వేదాల్లో ఉపనిషత్తుల్లో లేని కుల వ్యవస్థ మనకెందుకు?

*సామాజిక సమరసతా వేదిక సమతా సమ్మేళనం

హిందూ ప్రామాణిక గ్రంథాలైన వేదాల్లో, ఉపనిషత్తుల్లో లేని కులం పేరిట ఇప్పుడు మనుషులు విడిపోవడం, విభేదాలు చోటు చేసుకోవడం ధర్మ విరుద్ధమని అవధాన సరస్వతి పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు స్పష్టం చేశారు. కులం గడప లోపల ఉండాలని గడప దాటిన తర్వాత అందరం హిందువులం, భారతీయులమేనని ఆయన హితవు చెప్పారు.

 
స్వాగత సమితి కార్యదర్శి బార్ల వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగిన సామాజిక సమరసతా  వేదిక శ్రీకాకుళం ఆదివారం నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల సమతా సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ వేదాలు ఉపనిషత్తులు వంటి హిందూ గ్రంధాలలో లేని కుల వ్యవస్థ, వివక్ష,  అంటరానితనం వంటి వాటిని వెంటనే వదిలించుకోవాలని హితవు చెప్పారు.  సకల జనుల మంచిది కాంక్షించే వేదమే సృష్టికి మూలాన్ని కనిపెట్టిన ఒకే ఒక జాతి హిందూ జాతి అని గరికిపాటి స్పష్టం చేశారు.
 
వేదం ఎవరైనా చదవచ్చని నేర్చుకోవచ్చని ఆర్య సమాజ వ్యవస్థాపకులు దయానంద సరస్వతి ప్రచారం చేశారని గుర్తు చేశారు. కులంతో సంబంధం లేకుండా పింగళుడిని ఈశ్వరుడు నైరుతికి అధిపతిని చేశారని,  పాండవుల అజ్ఞాతవాసంలో కుమ్మరోళ్ల ఇంట్లోనే మూడు నెలలు ఉన్నారని, కోడలిగా ద్రౌపది కూడా అక్కడికే వెళ్లిందని చెప్పారు. వరాహ పురాణంలో మరో కులానికి చెందిన ధర్మ వ్యాసుడు కూతుర్ని మాతంగ మహర్షి తన ఇంటి కోడలుగా చేసుకున్నారని గుర్తు చేశారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని  కలువ రాయికి చెందిన  కావ్య కంఠవిశిష్ట గణపతి రమణ మహర్షి ఆశ్రమంలో కఠోర తపస్సు చేసి స్త్రీలకు సంపూర్ణ స్వాతంత్రం రావాలని, పంచమ జాతి పేరిట కుల వివక్ష ఆగిపోవాలని గుర్తు చేశారు. సంఘసంస్కర్తగా గురజాడ అప్పారావు, వితంతు వివాహం ప్రోత్సహించిన బంకుమల్లి మల్లయ్య శాస్త్రి, తాగునీటిపై అందరికీ సమాన హక్కులు ఉన్నాయని సర్దార్  గౌతు లచ్చన్న, కుల వివక్ష లేని సమాజం కోసం చట్టం తేవాలని తెన్నేటి విశ్వనాథం ఈ ప్రాంతం నుంచే ఉద్యమించారని వివరించారు. వీరందరి ఆకాంక్షలకు తగ్గట్టుగానే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కుల వివక్ష లేని రాజ్యాంగాన్ని మన ముందు ఉంచారని ఆయన ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని గరికపాటి పిలుపునిచ్చారు ఇచ్చారు.

 
వసుదైక కుటుంబం భావనను ప్రపంచానికి అందించిన ఉత్తమ దేశం భారతదేశమని, కులాల పేరిట వివక్షకు ఇక్కడ తావు లేదని ఉత్తరాంధ్ర సాదు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద పేర్కొన్నారు. పలు కులాల్లో ఒకే ఇంటి పేరు, ఒకే గోత్రం ఉండటం గతంలో వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారనే  స్పష్టం చేస్తున్నదని చెప్పారు.
 
నదులన్నీ సముద్రంలో కలిసినట్టే ప్రపంచంలోని అన్ని ధర్మాలు హిందూ ధర్మంలో కలవాల్సిందేనని పేర్కొంటూ అందుకే భారతీయులంతా ధర్మాన్ని సంస్కృతిని కాపాడేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. నేను నీకు నీవు నాకు నేను నీవు ధర్మానికి రక్ష అంటూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా తన తండ్రి సర్దార్ గౌతు లచ్చన్న ప్రాణాలకు తెగించి కృషి చేశారని చెప్పారు. దళితులకు మిగిలిన వారికి సమానంగా బావిలో నీరు తోడుకునే అవకాశం కల్పిస్తే భౌతికంగా దాడులు చేస్తామని చెప్పినా లెక్కచేయకుండా సామాజిక సమరసత కు ఆయన కృషి చేశారని గుర్తు చేశారు.

గ్రామాల్లో అందరికీ దేవాలయ ప్రవేశం, స్మశానాల్లో వివక్ష లేకుండడం,  నీటి దగ్గర సమానత్వం ఉన్నప్పుడే కుల వ్యవస్థ నుంచి దూరమైనట్టని  ఆర్ఎస్ఎస్ సహ ప్రాంత ప్రచారక్ జనార్ధన్ చెప్పారు. పలు సంఘటనలో అగ్రవర్ణాలుగా చెప్పుకునే వారు  దూరంగా పెట్టిన నిమ్న జాతిల వారిని దేవుల్లే ఆశీర్వదించారని గుర్తు చేశారు. కులం అంటరానితనం పేరిట జరిగే వివక్షను  దుష్ట సంప్రదాయాన్ని పారద్రోలి సమరసతను  సాధించాల్సిన బాధ్యత హిందువుల అందరి మీద ఉందని గుర్తు చేశారు.

ఆంధ్ర విద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య జి నాగేశ్వరావు మాట్లాడుతూ దేశ చరిత్రను పాఠ్య పుస్తకాలనుంచి తీసివేయటం వల్లే సమాజంలో వివక్ష ఎక్కువైందని పేర్కొన్నారు. చెట్టు పుట్ట రాయి రప్పని పూజించే హైందవ ధర్మం మనుషులను సమానంగానే చూస్తుందని స్పష్టం చేశారు. హిందూ అనేది మతం కాదని జీవన విధానం అని అది ప్రపంచ శాంతిని కోరుతుందని చెప్పారు.

మాజీ ఉప కులపతి  లజపతిరాయ్ మాట్లాడుతూ సామాజిక సమరసత నేటి అవసరమని, అందరూ అందుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు సమాన అవకాశాలు, కుల వివక్ష అంతమైతే మనుషుల మధ్య విభేదాలు ఉండమని  ప్రిన్సిపాల్ పాక సుందరి రాణి స్పష్టం చేశారు. సమాజం నుంచి కులం అనే క్యాన్సర్ తీసేయాలని వేదిక రాష్ట్ర కన్వీనర్ దూలం  బూసిరాజు పిలుపునిచ్చారు.

 
ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అంటరానితనానికి, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వారి కుటుంబాల వారసులకు సన్మానం జరిగింది. వేదిక జాతీయ నాయకులు కే శ్యాం ప్రసాద్, సిరిపురపు కన్నం నాయుడు, రాగాల నరసింహారావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మూడు జిల్లాలకు చెందిన వేయి మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.