మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈజిప్టు పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ”ఆర్డర్ ఆఫ్ ది నైల్” అందుకున్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్‌-సిసి ఈ పురస్కారాన్నికి మోదికి అందజేశారు. ఈ అవార్డును తనకు అందించినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.  ఈజిప్టులో మోదీ అధికారికంగా తొలిసారి పర్యటిస్తుండగా, 1997 తర్వాత భారత ప్రధాని ఒకరు ఈజిప్టులో పర్యటిస్తుండటం ఇది మొదటిసారి.
ఈజిప్టు, భారత్‌ల మధ్య వాణిజ్య సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ ఈ పర్యటన చేపట్టారు. శనివారంనాడు ఈజిప్టులో మోదీ పర్యటన ప్రారంభించగా, ఆయనకు ఈజిప్టు ప్రధాని మోస్తఫా మద్‌బౌలీ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఈజిప్టు సేనల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
గత ఏడాది గణతంత్ర వేడుకలకు అతిథిగా హాజరైన అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఆహ్వానం మేరకు మోదీ ఈజిప్టులో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా, మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు, పాలస్తీనాల్లో ఉండి పోరాడి మరణించిన భారతీయ సైనికులకు కామన్‌వెల్త్ వార్ గ్రేవ్ సిమిట్రీలో నిర్మించిన స్మారకాన్ని మోదీ సందర్శించి, అమరవీరులకు నివాళులర్పించారు.

ఈజిప్టులో 11వ శతాబ్దపు నాటి అల్-హకీం మసీదును ప్రధానమంత్రి మోదీ ఆదివారంనాడు సందర్శించారు. దవూది బోహ్రా కమ్యూనిటీ సహకారంతో ఈ మసీదును పునరుద్ధరించారు. భారత్, ఈజిప్టు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఈ మసీదు నిలుస్తుంది. కాగా, ప్రధాని తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మద్ బౌలీ, ఆయన క్యాబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలపై చర్చించారు. ఎంఓయూలపై సంతకాలు చేశారు. ప్రవాస భారతీయులను, బోహ్రా కమ్యూనిటీ సభ్యులను కూడా కలుసుకున్నారు.

ఈజిప్ట్ మత గురువుతో ప్రధాని భేటీ

ప్రధాని మోదీ శనివారం ఈజిప్టు మత పెద్ద షాకీ ఇబ్రహి అబ్దెల్ కరీం ఆలంతో సమావేశమై సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడం, తీవ్ర వాదాన్ని నిరోధించడంపై విస్తృతంగా చర్చలు జరిపారు.  ఈ సందర్భంగా  దార్ అల్‌ఇఫ్తా వద్ద ఐటిలో ఈజిప్టు సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌ను నెలకొల్పడమౌతుందని ప్రధాని తెలిపారు.

భారత్ ఈజిప్టు దేశాల మధ్య బలంగా ఉన్న సాంస్కృతిక, ప్రజల సంబంధాలపై చర్చించారని, సామాజిక సామరస్యం, తీవ్ర వాద నిరోధంపై కూడా చర్చలు జరిగాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు. సమన్వయం, బహుళత్వ సాధనలో ప్రధాని మోడీ నాయకత్వాన్ని మత పెద్ద అభినందించారని చెప్పారు.

ఢిల్లీలో జరిగిన సూఫీ సదస్సుల్లో ఒక సదస్సులో మోదీని తాను కలుసుకోగలిగానని, ఈ రెండు సమావేశాల మధ్య భారత్‌లో గొప్ప అభివృద్ది కనిపించిందని మత పెద్ద షాకీ ఇబ్రహి అబ్దెల్ కరీం ఆలం తెలిపారు. ఈజిప్టు, భారత్ దేశాల మధ్య మతపరమైన స్థాయిలో పటిష్టమైన సహకారం ఉంటోందని, దీన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.

భారత సాంస్కృతిక సంబంధాల మండలి ఆహ్వానంపై ఆయన గత నెల భారత్‌ను సందర్శించారు. ప్రపంచంలో ఎదురౌతున్న సవాళ్ల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సహకారం, సయోధ్య అవసరమని ప్రధాని మోడీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ప్రకటనలు గుప్పించడాన్ని ఉదహరిస్తూ అలాంటి చర్చలు స్వాగతించ దగినవే అయిప్పటికీ, ఆ ఆకాంక్షలు సుస్థిర సంబంధాలుగా పరస్పరం అభివృద్ధి చెందడానికి ఆచరణాత్మక మైన అడుగులు ముందుకు పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.