తెలంగాణాలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందింది

తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానాలు చేశారని, కానీ ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ది పొందిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణలో ఏ వర్గం సంతోషంగా లేదని నాగర్ కర్నూలులో జరిగిన బీజేపీ నవ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటూ స్పష్టం చేశారు.

ప్రపంచం అంతా భారత ప్రధాని మోదీని కొనియాడుతుంటే.. దేశంలో ఉన్న ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు మాత్రం నిత్యం తిడుతున్నారని, కులం, మతం పేరుతో దూషిస్తున్నారు ధ్వజమెత్తారు. మోదీ ది బాస్ అని దేశాధినేతలే కొనియాడుతున్నారన్నారు. ఈజిప్టు అత్యున్నత పురస్కారం మోదీకి దక్కిందన్నారు. ఆర్థికంగా దూసుకుపోతున్న దేశం మనదే. ఆయన దేశానికి ప్రపంచానికి ఎంతో చేశారు.

పాట్నాలో జరిగింది అవినీతి, కుల, కుటుంబ పార్టీల ఫొటో సెషన్ అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ అని పేరు మాత్రమే మార్చారని చెబుతూ బీఆర్ఎస్ అంటే భ్రష్టచార రాక్షసుల సమితి అని దుయ్యబట్టారు. తెలంగాణకు ప్రధాని మోదీ భారీగా నిధులు ఇచ్చారని చెబుతూ రూ. 11300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రధాని మోదీ పాలనలో దేశం పురోగమిస్తోందని చెబుతూ బీజేపీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని జేపీ నడ్డా తేల్చి చెప్పారు.

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు మోడీ ప్రభుత్వం రూ. 4400 కోట్లు మంజూరు చేసిందని, తెలంగాణ కోసం మెగా టెక్స్‌టైల్స్ పార్కును మోదీ ఇచ్చారని పేర్కొన్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్‌ను ప్రధాని ప్రారంభించారని గుర్తు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్లు మోదీ  సర్కారు ఇచ్చిందని చెప్పారు.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రూ.4 కోట్ల మందికి ఇళ్లు నిర్మించామని, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తున్నామని వెల్లడించారు. ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనతో అన్ని వర్గాలకు న్యాయం చేశామని, దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని తెలిపారు.

కరోనా కష్టకాలం, యుక్రెయిన్ యుద్ధ సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా భాతర దేశంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతమై ముందుకు సాగామని గుర్తు చేశారు. నేడు ప్రపంచ ఆర్థిక స్థితిలో భారతదేశం 5వ స్థానంలో ఉందని చెప్పారు. దేశంలోని 5 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లను డబ్లింగ్ చేయడం పూర్తైందని చెబుతూ  కశ్మీర్‌లోని లద్దాఖ్ నుంచి తెలంగాణ వరకు 2500 కిలో మీటరల జాతీయ రహదారిని విస్తరించడం జరిగిందని నడ్డా వివరించారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ సామర్థ్యం పూర్తిగా నాశనం అయిందంటూ జేపీ నడ్డా మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ నేతల జేబులు నింపుతున్న ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత మాత్రమే తెలంగాణ ఏర్పాటుతో లబ్ది పొందారని ధ్వజమెత్తారు.

మోదీ తొమ్మిదేళ్ల పాలనతో దేశం ఎన్నో రంగాల్లో ముందుకెళ్లగా, అందులో తెలంగాణ భాగం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్లలో వేసిన రోడ్లను మోదీ ప్రభుత్వం కేవలం 9 ఏళ్ల పాలనలోనే నిర్మించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి రేషన్ అందిస్తుందని వెల్లడించారు.

పేదవాడు ఆకలితో ఉండకూడదనే 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో పేదరికం 22 శాతం ఉంటే, మోదీ పాలనతో పేదరికం 10 శాతం కన్నా తక్కువకు తగ్గిందని తెలిపారు. పేదవాడికి సొంతింటి కల సాకారం చేయడానికి 4 కోట్ల మందికి పక్కా 2.5 లక్షల ఇళ్లు కట్టించామని పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ ఆ ఇండ్లు తామే కట్టించామని గొప్పలు చెప్పుకుంటుందని జేపీ నడ్డా ఎద్దేవా చేశారు.