బిఆర్ఎస్ తో రాజీ లేదు.. నడ్డా స్పష్టం

తెలంగాణాలో బిఆర్ఎస్ తో రాజీ లేదని, వచ్చే ఎన్నికలలో ఆ పార్టీపై తీవ్రంగా పోరాటానికి సంసిద్ధం కావాలని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా స్పష్టం చేశారు. తెలంగాణలో పర్యటనలో భాగంగా  నోవాటెల్ హోటల్ లో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో జరిపిన భేటీలో మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.
 
రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ నేతలతో నడ్డా చర్చించారు. ఎన్నికల సన్నద్ధతపై నేతలు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అంతేకాదు పార్టీ లైన్‌ దాటి ఎవరూ మాట్లాడొద్దని హెచ్చరించారు.
 
ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా నడ్డాకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.  మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 2.30 వరకు సంపర్క్ సే అభియాన్‌లో జూబ్లీహిల్స్‌లో క్లాసికల్ డ్యాన్సర్ పద్మశ్రీ ఆనంద శంకర ఇంటికి వెళ్లారు. రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావును కలిసి, ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన, అభివృద్ధి గురించి వివరించి పుస్తకాలు అందజేశారు.
 
అనంతరం నోవాటెల్ హోటల్ లో బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. . కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్, రఘునందర్ రావు, విజయశాంతి, వివేక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.