ఓఎంఆర్‌ షీట్‌పై హాల్‌టికెట్‌ నెంబర్‌, ఫోటో లేవే?

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజ్ నేడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించడంతో ఆ పరీక్షలకు హాజరైన లక్షలాది మంది యువత భవిష్యత్ అయోమయంలో చిక్కుకోగా, తాజాగా తిరిగి నిర్వహించిన  గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై కూడా పాలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఓఎంఆర్‌ షీట్‌పై హాల్‌టికెట్‌ నెంబర్‌, ఫోటో ఎందుకు లేవని, అభ్యర్థుల బయోమెట్రిక్‌ ఎందుకు సేకరించలేదని టీఎస్‌పీఎస్‌సీను హైకోర్టు ప్రశ్నించింది.
గతేడాది అక్టోబర్‌ 16న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు చేసినవన్నీ రెండో సారి జూన్‌ 11లో జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు ఎందుకు చేయలేదని కోర్టు అడిగింది.  ఈనెల జూన్‌ 11న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ ముగ్గురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో న్యాయమూర్తి జస్టీస్‌ పి.మాధవి దేవి విచారణ చేపట్టారు.
అభ్యర్థుల బయోమెట్రిక్‌ సేకరించకపోవడం, ఓఎంఆర్‌ షీట్‌పై అభ్యర్థుల ఫోటో, హాల్‌టికెట్‌ నెంబర్‌ లేకపోవడం అనుమానస్పదంగా ఉందని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  దీనిపై టీఎస్‌పీఎస్‌సీ న్యాయవాది కోర్టుకు బదులిస్త్తూ బయోమెట్రిక్‌, ఓఎంఆర్‌పై ఫోటోకు సుమారు రూ.1.50 కోట్లు ఖర్చవుతోందని తెలిపారు. పరీక్షల ఏర్పాటు ఎలా చేయాలన్నది టీఎస్‌పీఎస్‌సీ విచక్షణాధికారమని కోర్టుకు వివరించారు. అనుభవం, నైపుణ్యంతో కమిషన్‌ తగిన ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను దాదాపు 3.80 లక్షల మంది అభ్యర్థులు రాయగా, అందులో కేవలం ముగ్గురు మాత్రమే పిటిషన్‌ వేశారని, మిగతా వారెవరూ అభ్యంతరాలు చెప్పలేదని టీఎస్‌పీఎస్‌సీ వాదించింది. పరీక్షలో ఎలాంటి అక్రమాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు జరిగాయని, ఆధార్‌, పాన్‌ వంటి గుర్తింపు కార్డుల ద్వారా ఇన్విజిలేటర్లు అభ్యర్థులను ధ్రువీకరించుకొని పరీక్షను నిర్వహించారని కోర్టుకు టీఎస్‌పీఎస్‌సీ వివరించింది.

అయితే పరీక్షల నిర్వహణలో ఖర్చులు ముఖ్యం కాదని, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం టీఎస్‌పీఎస్‌సీ చట్టబద్ధమైన బాధ్యతని హైకోర్టు తెలిపింది. అయినా పరీక్షల కోసం అభ్యర్థులు ఫీజు చెల్లిస్తున్నారని కోర్టు ప్రస్తావించింది.

పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ఒకరి బదులు మరొకరు రాయకుండా ఉండేందుకు బయోమెట్రిక్‌, ఫోటో, హాల్‌టికెట్‌ నెంబర్‌ వంటి కీలక అంశాలు అవసరం కదా అని పేర్కొంది. అలాంటి వాటిని విస్మరిస్తే ఎలాని ప్రశ్నించింది. పిటిషన్‌పై మూడు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ టీఎస్‌పీఎస్‌సీకు హైకోర్టు ఈమేరకు నోటీసులు జారీ చేసింది.