తెలంగాణ ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ కసరత్తు

తెలంగాణ అసెంబ్లీ పదవీకాలం డిసెంబర్ లో ముగియనున్న దృష్ట్యా ఈ లోగా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ కసరత్తు వేగవంతం చేసింది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఎన్నికల నిర్వహణపై ఈసీ అధికారులు అవగాహన సమావేశం నిర్వహించినట్లు సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. 

రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఓటింగ్‌ శాతాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు అవగాహన కల్పించారు. సమస్యాత్మక ప్రాంతాలు, స్ట్రాంగ్‌ రూంల భద్రతపైనా ఆరా తీశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతపై సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని ఈవీఎంలు ఉన్నాయి? వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి? వీవీ ప్యాట్లున్నాయా? వాటి తాజా పరిస్థితి ఏమిటి? అన్న అంశాలపైనా ఇప్పటికే సమాచారం తెప్పించుకున్న ఈసీ అధికారులు సమావేశం అనంతరం నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై ఓ అంచనాకు రానున్నారు. ఇక్కడ పరిస్థితులను క్రోడీకరించుకున్న తర్వాత ఈసీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది. వాతావరణ శాఖ నుంచి కూడా నివేదిక తీసుకుంటుంది.  సాధారణంగా రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఏమిటి? నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులుంటాయి? పోలింగ్‌ నిర్వహణకు ఏమైనా ఆటంకాలు ఎదురవుతాయా? అన్న విషయాలను బేరీజు వేసుకున్న తర్వాత తేదీలను ఖరారు చేస్తుంది.

సమీక్షా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ కమిషనర్‌లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్‌ వ్యాస్‌, డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ఆర్కే గుప్తా, సంజయ్‌కుమార్‌, కార్యదర్శి అవినాష్‌ కుమార్‌, ముఖ్యకార్యదర్శి హర్దేష్‌కుమార్‌, డిప్యూటీ కమిషనర్‌ మనోజ్‌ కుమార్‌ సాహూ, డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ బి.నారాయణన్‌, డైరెక్టర్‌ జనరల్‌ (మీడియా) ఎన్‌ఆర్‌ బుటోలియా, సీనియర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ(డైరెక్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌) దీపాలీ మసిర్కర్‌ తదితరులు పాల్గొన్నారు.