కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లే

కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ నాయకల కంటే కాంగ్రెస్ పైనే ఎక్కువ నమ్మకం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నుండి ఎవరు గెలిచినా మళ్లీ వెళ్లేది బీఆర్ఎస్ లోకేనని చెప్పారు.
 
‘‘మహా జనసంపర్క్ అభియాన్’’లో భాగంగా బిజెపి నేతలు గురువారం తెలంగాణాలో ‘‘ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమం చేపట్టి తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, చేపట్టిన అభివ్రుద్ది, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. స్టిక్కర్లను స్వయంగా అంటించారు.
 
బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ లోని చైతన్యపురి, జ్యోతినగర్ కాలనీల్లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తూ  9 ఏళ్లుగా ప్రజలను పట్టించుకోని కేసీఆర్ ప్రచారం కోసం రూ. వెయ్యి కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.  ఏనాడూ అమరవీరుల కుటుంబాల ముఖం చూడని కేసీఆర్.. ఇయాళ పిలిచి సన్మానం చేయడం, శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వెనుక పెద్ద జిమ్మిక్కు అని విమర్శించారు.
 

‘‘ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమం ద్వారా ఈ ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెబుతూ తెలంగాణలో 90 లక్షలకుపైగా కుటుంబాలుంటే అందులో మూడో వంతుకుపైగా కుటుంబాలను బీజేపీ కార్యకర్తల నుండి రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల వరకు కలిసేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు.

“మేం చాలా పాజిటివ్ మూడ్ లో చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ జనంలోకి వెళుతున్నాం. ప్రజల్లో మంచి స్పందన వస్తోంది. దీంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లారీ, ఆటో, ట్రాలీ, బస్ డ్రైవర్లందరినీ ఒకరోజు కలుస్తాం. వీరితోపాటు టీ స్టాల్స్, పాన్ దుకణాలు, హోటళ్లు, వ్యాపార నిర్వాహకులను కలవాలని నిర్ణయించాం” అని సంజయ్ తెలిపారు.

తెలంగాణకు కేంద్రం ఏం చేసిందనే అంశంపై మొన్న కిషన్ రెడ్డి అన్ని వివరాలు ప్రకటించారని చెబుతూ  బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలప్పుడు ఏయే హామీలిచ్చారు? ఎన్ని నెరవేర్చారు? ఎంత అభివ్రుద్ధి చేశారో ‌వివరించాలని తాము కోరుతుంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రం అందుకు భిన్నంగా ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు.

బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేయకపోవడంపై ప్రస్తవాసితు సీబీఐ, ఈడీ రాజ్యాంగబద్ద సంస్థలని,  మోదీ హయాంలో అవినీతిపరులు తప్పించుకునే ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. అయితే నిందితులు తప్పించుకోవడానికి వీల్లేకుండా పకడ్బందీగా ఆధారాలు సేకరించిన తరువాతే అరెస్ట్ చేసి జైలుకు పంపుతోందని తెలిపారు. అంతే తప్ప బీజేపీ చెబితే అరెస్ట్ చేయరని, వద్దంటే ఆగరని తెలిపారు.