దళారీ వ్యవస్థను అరికట్టడానికే శ్రీవాణి ట్రస్ట్‌

ఆలయాల నిర్మాణమునకు, దళారీ వ్యవస్థను అరికట్టడానికి శ్రీవాణి ట్రస్ట్‌లో దర్శన విధానాన్ని ప్రారంభించామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం శ్రీవాణి ట్రస్ట్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేస్తూ 70 మంది దళారీలను అరెస్ట్ చేయడంతో పాటు 214 కేసులు నమోదు చేశామని చెప్పారు.

శ్రీవాణి ట్రస్ట్‌కి భక్తులు ఇచ్చిన విరాళాలకు టికెట్లతో పాటు రసీదు ఇస్తున్నామని పేర్కొంటూ   శ్రీవాణి ట్రస్టు ద్వారా 2023, మే 31 వరకు రూ.861 కోట్ల నిధులు వచ్చాయని, వివిధ బ్యాంకుల్లో 602.60 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. ఎస్‌బీ ఖాతా కింద రోజువారీ వచ్చే డబ్బు రూ.139 కోట్లు బ్యాంకుల్లో ఉందని, డిపాజిట్లపై వడ్డీ రూపంలో రూ.36.50 కోట్లు వచ్చాయని తెలిపారు

2019 సెప్టెంబర్ 23 నుంచి శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు సమర్పించిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. అప్పటి నుంచి ట్రస్ట్‌కు భక్తుల నుంచి భారీ స్పందన లభిస్తున్నదని తెలిపారు. ఇప్పటివరకు 8.24 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు.

దేవాలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి ఇప్పటిదాకా రూ.120.24 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు రూ.139 కోట్లు కేటాయించామన్నారు. భజన మందిరాలు, ఎస్సీ, గిరిజన ప్రాంతాల్లో 2273 ఆలయాలను నిర్మించనున్నామని, దీనికోసం రూ.227.30 కోట్ల కేటాయించినట్లు తెలిపారు.

శ్రీవాణి ట్రస్టు నిధులు ఎక్కడా దుర్వినియోగం కావడం లేదని స్పష్టం చేశారు. రూ.500, రూ.300లకు భక్తులకు రసీదు ఇవ్వడమనేది అవాస్తవమని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసిన ప్రతీ ఒక్క భక్తుడికి రసీదులు ఇస్తున్నామని స్పష్టం చేసారు.  ఇప్పటి వరకు 8 లక్షల మందికిపైగా భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామి వారిని దర్శించుకోగా, ఎవరు టీటీడీపై ఆరోపణలు చెయ్యలేదని చెప్పారు.

శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనానికి వెళితే రసీదులు ఇవ్వలేదంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీటీడీపై ఆరోపణలు చేశారని పేర్కొంటూ  ఆయన ఎప్పుడు దర్శనానికి వచ్చారో చెబితే పరిశీలించి రసీదులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆధారాలు లేకుండా రాజకీయ పరంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆరోపణలు చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని సుబ్బారెడ్డి హెచ్చరించారు.

ఆలయాల నిర్మాణానికి రూ. 120 కోట్లు వ్యయం చేశామంటూ  ఎపి, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరిలోని 127 పురాతన ఆలయాల పున:నిర్మాణం రూ. 139 కోట్లతో చేశామని చెప్పారు. 2273 ఆలయాలు, గోశాలలు, భజన మందిరాల నిర్మాణానికి రూ.227 కోట్లు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 1953 ఆలయాలు, సమరసతా ఫౌండేషన్ ద్వారా 320 ఆలయాలు నిర్మిస్తున్నామని వివరించారు.