2100 నాటికి హిమానీ నదాలు అదృశ్య ప్రమాదం

ప్రపంచంలో అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాలకు కాలుష్యాలు, కర్బన ఉద్గారాలు తీరని ముప్పు తెస్తున్నాయి. వీటిని అరికట్టలేకుంటే హిమాలయాలకు జీవం కలిగించే హిమానీ నదాలు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఉత్తర దక్షిణ ద్రువ ప్రాంతాల బయట హిమాలయాల్లో హిందూకుష్ పర్వత శ్రేణులు ఎక్కువ మంచు సముదాయంతో అత్యంత ఎత్తులో ఉంటాయి. నిత్యం నదులు ప్రవహించడానికి ఈ హిమాలయ పర్వత శ్రేణుల పై ఉన్న హిమానీనదాలే ఆధారం. కానీ కర్బన ఉద్గారాల వెల్లువ మితిమీరి పోతుండడంతో హిమానీ నదాలు అంతరించిపోతున్నాయి.

వీటిని ఇప్పటికైనా బాగా అరికట్టలేకుంటే 2100 సంవత్సరం వచ్చేసరికి 80 శాతం హిమానీ నదాలు కనిపించకుండా పోతాయని శాస్త్రవేత్తల అధ్యయనం హెచ్చరిస్తోంది. కాట్మండ్ కేంద్రంగా గల ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటెగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ నిర్వహించిన అధ్యయనంలో ఈ వాస్తవాలు బయటపడ్డాయి.

 2000- 2009 సంవత్సరాల మధ్యకాలంతో పోల్చుకుంటే 2010 -2019 నాటికి 65 శాతం వరకు హిమానీనదాల మంచు కోల్పోవడమైంది. హిందూ కుష్ హిమాలయ పర్వత శ్రేణులపై కప్పబడి ఉన్న మంచుగడ్డలు, హిమానీ నదాలు 12 నదులకు నిత్యం నీటి వనరులు అందిస్తుంటాయి. ఈ రీజియన్‌లో నివసించే 240 మిలియన్ ప్రజలకు తాజా జలాలు అందిస్తుంటాయి. దిగువ నున్న మరో 1.65 బిలియన్ ప్రజలకు కూడా ఇవి నీళ్లిస్తుంటాయి.

అయితే మానవ కల్పిత కారణాలతో వాతావరణంలో మార్పు వచ్చి విపరీతంగా వరదలు ముంచెత్తడం, హిమపాతాలు సంభవించడం జరుగుతోంది. ఈ ప్రభావం రెండు బిలియన్ ప్రజలపై పడుతోంది. సంప్రదాయ నీటిపారుదల మార్గాలు నాశనమవుతున్నాయి. పంటలు దెబ్బతింటున్నాయి. సారవంతమైన నేల క్షీణిస్తోంది.

భూమి వినియోగంలో మార్పులు వస్తున్నాయి. మొత్తం మీద వ్యవసాయం క్షీణిస్తోంది. పాడిపశు సంపద కుంటుపడుతోంది. 4.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన హిందూకుష్ రీజియన్‌లో మౌంట్ ఎవరెస్ట్, కె 2 తదితర ప్రపంచంలోనే ఎత్తైన ఉన్నత పర్వత శ్రేణులు ఉన్నాయి.

పశ్చిమాన అఫ్గానిస్థాన్ నుంచి తూర్పున మయన్మార్ వరకు 3500 కిలోమీటర్ల పొడవునా ఇవి పెట్టని గోడలా ఉంటున్నాయి. పాకిస్తాన్, భారత్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ దేశాలన్నీ వీటికి ఆనుకునే ఉంటున్నాయి.  ప్రకృతి వనరులు, ఓషధులు, అడవులు, వివిధ రకాల పక్షులు, వన్యమృగాలతో జీవవైవిధ్యానికి ప్రతిబింబంగా హిమాలయాలు, ఇండోబర్మా, మధ్య ఆసియా పర్వతాలు, వాయువ్య చైనా పర్వతాలు అనే నాలుగు రకాల ప్రపంచ జీవవైవిధ్య కీలక ప్రాంతాలు ఇందులో ఉన్నాయి.