అస్సాం వరదల్లో నీట మునిగిన వందలాది గ్రామాలు 

అస్సాంలో కురిసిన కుండపోత వర్షాలకు వందలాది గ్రామాలు నీటమునిగాయి. వేలాది మంది ప్రజలు వరదనీటిలో చిక్కుకుని ఎన్నో కష్టాలు పడుతున్నారు. అస్సాంలోని నల్బరీ జిల్లా అత్యధికంగా వరద ప్రభావానికి గురైంది. ఆ జిల్లాలోని ఆరు రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని సుమారు 45 వేల మంది ప్రజలు, 108 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
 
ఇక మొయిరారంగ, బటాఘిలా గ్రామాల్లోని 200 కుటుంబాలు వరదల్లో చిక్కుకున్నాయి. వరద ప్రభావితమైన ఈ రెండు వందల కుటుంబ సభ్యులు ప్రస్తుతం రోడ్లపై టెంట్లు వేసుకుని ఆశ్రయం పొందుతున్నారు. కేవలం అస్సాం మాత్రమే కాదు, పొరుగు దేశమైన భూటాన్‌లో గత కొన్నిరోజులుగా కుండపోత వర్షాలు కురిశాయి.
 
దీంతో అక్కడ పగ్లాడియా నది నీటి మట్టం ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఈ నదీ ప్రవాహం పెరగడంతో గడచిన 24 గంటల్లో మరికొన్ని కొత్త ప్రాంతాలను కూడా వరద నీరు ముంచెత్తింది. ఇక నల్బరీ జిల్లాలోని ఘెగ్రాపర్‌, తిహు, బార్‌భాగ్‌, ధామ్‌ధామా ప్రాంతాల్లోని దాదాపు 90 గ్రామాలు వరద నీటమునిగాయి. దీంతో చాలామంది గ్రామస్తులు ఇంటిని వదిలి.. ఎత్తైన ప్రదేశాలు, రోడ్లపైన టెంట్లు వేసుకుని ఆశ్రయం పొందారు.

ఇక ఈ జిల్లాలో దాదాపు 310 హెక్టార్ల పంట పొలాలు వరద నీటిలో మునిగాయి. గడచిన 24 గంటల్లో ఈ వరద నీటికి రెండు కరకట్టలు, 15 రోడ్లు, రెండు బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. అస్సాంతోపాటు, పొరుగు రాష్ట్రాలు, దేశమైన భూటాన్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక నదులు ప్రమాద స్థాయి నీటి మట్టం పెరిగి చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి అని అస్సాం స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డిఎంఎ) నివేదిక పేర్కొంది.

ఎస్‌డిఎంఎ నివేదిక ప్రకారం నల్బరీ జిల్లాలోనే అత్యధికంగా 44,707 మంది వరద ప్రభావానికి గురయ్యారు. అలాగే బక్షా జిల్లాలో 26,571 మంది, లఖింపూర్‌ 25,096 మంది, తముల్‌పుర్‌ జిల్లాలో 15,610 మంది, బార్పేట జిల్లాలో 3,840 మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.