మార్గదర్శిపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరిన ఏపీ సిఐడి

ఏపీలో అక్రమాలకు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్గదర్శి చిట్స్ కు ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో భారీగా ఆస్తుల్ని అటాచ్ చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం తాజాగా మరిన్ని చర్యలకు దిగింది. మార్గదర్శి చిట్స్ కు చెందిన 23 చిట్ గ్రూపుల్ని నిలిపేస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవంక, ఇందులో నిధుల మల్లింపు అంశంపై దర్యాప్తుకు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలను ఈ స్కాంపై దర్యాప్తు చేయమని కోరినట్లు అధికారులు  తెలిపారు. మార్గదర్శి అక్రమాల కేసులో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 23 చిట్ గ్రూపుల్ని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వీటి టర్నోవర్ రూ.604 కోట్లుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు వ్యవహారంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని అనంతపురం, అరండల్ పేట, నరసరావుపేట, విశాఖ, తణుకు, రాజమండ్రి బ్రాంచ్ ల పరిధిలో ఈ గ్రూపులు ఉన్నట్లు తెలుస్తోంది.ఏపీలో అతిపెద్ద చిట్ ఫండ్ స్కాం ను నిరోధించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు  ప్రకటించారు.

మార్గదర్శి చిట్‍ఫండ్స్ పై మార్చి 10న దర్యాప్తు చేపట్టగా,  ఇప్పటి వరకు 7 ఎఫ్ఐఆర్ లను లనమోదు చేసి, నలుగురు ఫోర్‍మెన్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సమాచారంతో ఆడిటింగ్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజాకిరణ్ ఉన్నారని, నాలుగు రాష్ట్రాల్లో 108 మార్గదర్శి బ్రాంచ్‍లు నడుస్తున్నాయని తెలిపారు.

ఏపీలో 37 బ్రాంచ్‍లు, 2351 చిట్ గ్రూప్స్ ఉన్నాయన్నారు. రెండు జీవోల ద్వారా రూ.1,035 కోట్లు అటాచ్ చేసినట్లు వెల్లడించారు. అటాచ్‍మెంట్‍లో ఆస్తులు, మ్యూచ్‍వల్ ఫండ్స్ ఉన్నాయని సిఐడి ప్రకటించింది. కంపెనీ మూతపడితే ఖాతాదారులకు చెల్లించాల్సిన బాధ్యత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కు ఉంటుందని, అందుకే ఏపీ సీఐడీ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మార్గదర్శి అక్రమాలపై ఇప్పటివరకూ జరిగిన తనిఖీల్లో గుర్తించిన అంశాల ఆధారంగా ఇందులో మనీలాండరింగ్, కార్పోరేట్ మోసాలు కూడా జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. వాటి ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సిబిఐ, ఇడిలను దర్యాప్తు చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.