పున్నయ్య స్వామిపై కుట్రలతోనే లైంగిక ఆరోపణలు

కొందరు నాయకులు కుట్రలతోనే  జ్ఞానానంద ఆశ్రమం పూర్ణానంద సరస్వతి స్వామిపై లైంగిక దాడి ఆరోపణలు చేస్తున్నారని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి విమర్శించారు.  విశాఖపట్నం కొత్త వెంకోజీపాలెంలో ఉన్న రామానంద, జ్ఞానానంద ఆశ్రమానికి విచ్చేసి మీడియాతో మాట్లాడారు.

గతంలో కూడా ఇక్కడి భూములు ఆక్రమించడానికి ప్రయత్నాలు జరిగాయి చెబుతూ  అందులో భాగంగానే స్వామిని చంపేస్తాను అని బెదిరించారని ఆయన గుర్తు చేశారు. ఇక్కడి బాలిక అదృశ్యంపై పోలీసు ఫిర్యాదు చేశారని, ఇంతలో ఆ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన్నట్లు వచ్చిన ఆరోపణలు వెనుక బలమైన కుట్ర వుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ ఆశ్రమంలో ఉంటున్న స్వామీజీ కి సంబంధించి నడుస్తున్న వివాదం పైన కొందరు రాద్దాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసలు ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారని ధ్వజమెత్తారు.   రూ.కోట్లు విలువ చేసే భూముల ఆక్రమణ కోసమే కొన్ని రాబందులు నాలుగేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక్కడి స్వామి, పిల్లలు, సిబ్బందినీ బెదిరించడం, ఆవులు తరలించడం చేస్తున్నారన్నారని తెలిపారు. తాము ఆశ్రమం లో అడుగు పెట్టకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం అంటూ ఇదేమైనా పాకిస్తానా? అని అసహనం వ్యక్తం చేశారు.

కాగా, ఓ బాలిక తనపై స్వామీజీ అత్యాచారం చేశాడని విశాఖపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని, స్వామిజీని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరానికి చెందిన బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో విశాఖపట్నంలో ఉన్న జ్ఞాననాంద ఆశ్రమంలో బాలికను స్థానికులు చేర్పించారు.

 రాత్రి సమయంలో బాలికను తన రూమ్‌లోకి ఎత్తుకెళ్లి ఆమెపై పూర్ణానంద స్వామీజీ సంవత్సరం నుంచి అత్యాచారం చేస్తున్నాడని, స్వామిజీ తన గదిలో బాలికను బంధించి తీవ్ర చిత్రహింసలకు గురి చేసేవాడని ఆరోపణలు వచ్చాయి. అయితే, భూ వివాదం నేపథ్యంలోనే తనను ఇరికించాలని చూస్తున్నారని స్వామీజీ ఆరోపణలు చేశారు. కొందరు నేతలు ఆశ్రమానికి సంబంధించిన భూములపై కన్నేశారని, వారికి లొంగకపోవడంతోనే స్వామీజీని కేసులో ఇరికించారని ఆరోపణలు వెలువడుతున్నాయి.