శ్రీవాణి ట్రస్ట్ నిధులపై అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు

తిరుమల శ్రీవాణి ట్రస్ట్‌ నిధులను దుర్వినియోగ పరుస్తున్నట్లు రాజకీయ ఉద్దేశాలతో టీటీడీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవాణి ట్రస్టు నిధులను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.  శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై విపక్షాల విమర్శలను ఖండిస్తూ సోమవారం జరిగిన పాలకమండలి సమావేశం ఓ తీర్మానాన్ని ఆమోదించినట్లు ఆయన తెలిపారు. 
దేశంలో శ్రీవారి ఆలయ నిర్మాణాలతో పాటు హిందూ ధార్మిక ప్రచారం కోసం శ్రీవాణి ట్రస్ట్‌ను ప్రారంభించామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.  శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో 2445 ఆలయాలు నిర్మించామని చెబుతూ త్వరలోనే శ్రీవాణి ట్రస్ట్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం కాలేదని, దాతలు అందించిన ప్రతీ రూపాయికి రశీదులు ఇస్తామని స్పష్టం చేశారు.
శ్రీవాణి ట్రస్ట్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సుబ్బారెడ్డి హెచ్చరించారు. కొంత కాలంగా వసతి గదులపై ఫిర్యాదులు వ‌స్తున్న‌ నేపథ్యంలో రూ.4.23 కోట్లతో హాస్టళ్లను ఆధునీకరించేందుకు నిర్ణయించారు. లడ్డూ విక్రయ కేంద్రాల వద్ద రద్దీ పెరిగిన నేపథ్యంలో రూ.4.15 కోట్లతో అదనపు లడ్డూ కౌంటర్లు నిర్మించ‌నున్న‌ట్టు తెలిపారు.
 
మూడేళ్ల పాటు వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణ టెండర్‌ను ఎల్టీఈ సంస్థకు రూ.40.50 కోట్లకు కేటాయించినట్లు తెలిపారు. రూ.20.50 కోట్లతో సేవాసదన్, వకుళమాతతో పాటు పలు గదుల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని నిర్ణయించినట్లు వివరించారు.  ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో రూ.4 కోట్లతో అన్నదాన భవనం నిర్మాణం చేయనున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
రూ.3.55 కోట్లతో పోలీస్ క్వార్టర్స్ అభివృద్ధి చేయనున్నారు. రూ.2 కోట్లతో నగిరిలోని బుగ్గ ఆలయంలో కళ్యాణ మండపం నిర్మాణం, కర్నూలు జిల్లా అవుకు మండలంలో రూ.4.18 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. తిరుమలలో స్టైన్ లెస్ స్టీల్ బిన్లు ఏర్పాటు రూ.3.10 కోట్లు కేటాయించారు. రూ.5 కోట్లతో ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మించనున్నారు.
రూ.7 కోట్లతో టీటీడీలోని అన్ని విభాగాలలో నూతన కంప్యూటర్ ఏర్పాటు చేయనున్నారు. స్విమ్స్ ఆధునీకరణకు నిధులు కేటాయింపు, 1200 బెడ్స్‌తో అస్పత్రిని నిర్మించనున్నట్లు టీటీడీ పాలకమండలి తెలిపింది. రూ.6.65 కోట్లతో తిరుచానూరు పుష్కరిణి అభివృద్ధి చేయనున్నారు. గుజరాత్ లోని గాంధీనగర్, ఛత్తీస్‌గఢ్ రాయపూర్‌లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని పాలక మండలి నిర్ణయించింది.