వైసీపీ పాలకుల నుండి ప్రాణహాని … పవన్ కళ్యాణ్

వైసీపీ పాలకులు అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనన్న జనసేనాని.. తనకు ప్రాణహాని ఉందన్నారు. తనను హత్య చేయడానికి ప్రత్యేకంగా సుపారీ గ్యాంగులను దింపారనే సమాచారం ఉందన్నారు. తనతోపాటు జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు తప్పనిసరిగా భద్రతా నియమాలను పాటించాలని ఆయన సూచించారు.
 
2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. వైసీపీ అధికారంలోకి రాకపోయి ఉంటే.. తనను చంపేసేవారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అయితే  భయపెట్టే కొద్దీ తాను మరింతగా రాటు దేలుతానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. శనివారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
 
హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ముగ్గురు యువకులు రెక్కీ నిర్వహించారని గత ఏడాది నవంబర్‌లో జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో విచారణ జరిపిన పోలీసులు.. ఆ యువకులు తాగి రభస చేశారని.. పవన్‌కు ప్రాణహాని లేదని స్పష్టం చేశారు.
 
ఏపీ రాజకీయాల్లో ఉభయ గోదావరి జిల్లాలది కీలక పాత్ర అని చెబుతూ ఈ రెండు జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలు ఉండగా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క స్థానం కూడా దక్కకూడదని, గోదావరి జిల్లాలు వైసీపీ రహిత జిల్లాలుగా మారాలని పవన్ పిలుపిచ్చారు. దాని కోసం వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున బలమైన వ్యూహంతో పని చేయాలని సూచించారు.

తనకు స్ఫూర్తినిచ్చిన చెగువేరా తన ప్రాంతం, తన మనుషులు కాని వారి కోసం ప్రాణత్యాగం చేసి అమరుడయ్యాడని ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాయకత్వం అంటే త్యాగాలతో కూడిన బాధ్యతగా తాను భావిస్తానని చెప్పారు. జనసేన పార్టీని తపనతో నడుపుతున్నానని చెప్పిన పవన్ దీని వెనుక బలమైన భావజాలం, సిద్ధాంతం ఉన్నాయన్ని పేర్కొనారు.

 
తనను నమ్మిన 7 శాతం ప్రజల కోసమే 2019లో పార్టీ ఓడిపోయినా సరే బలంగా నిలబడ్డానని జనసేనాని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసైనికులు క్రమశిక్షణ తప్పొద్దన్న ఆయన ఏకత్వ స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు.  గతంలో జనసైనికులు, వీర మహిళల మీద కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు చేసిన దాడిని మర్చిపోయేది లేదన్న పవన్ ఓ బలమైన కార్యచరణ లేకపోవడంతో అప్పట్లో వెనుకడుగు వేశామని చెప్పారు. అయితే, కచ్చితంగా దీనికి బదులిచ్చే రోజు వస్తుందని స్పష్టం చేశారు.