`విశాఖ కిడ్నాప్’ సీబీఐ, ఎన్ఐఏ లకు అప్ప చెప్పాలి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విశాఖ ఎంపీ భార్య, కొడుకు, ఆడిటర్ కిడ్నాప్‌ వ్యవహారం కేసును థర్డ్ పార్టీ సీబీఐ, ఎన్‌ఐఏలతో విచారణ జరిపించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు డిమాండ్ చేశారు. ఇది కిడ్నాప్ కాదని ..సెటిల్‌మెంట్ వ్యవహారమేనని తమ అభిప్రాయాన్ని ఆయన తెలిపారు.

ఎంపీ రియల్ ఎస్టేట్‌ వ్యాపారి కావడంతో ఇచ్చుపుచ్చుకునే దగ్గర తేడాలా? లేక ఇతర కారణాలా? అనేది విచారించాలని డిమాండ్ చేశారు. అసలు ఇదంతా ఎవరో తెలియని వ్యక్తులు డబ్బు కోసం చేసిన పని కాదని స్పష్టం చేశారు.  అదృష్టం బాగుండి ఎంపీ కొడుకు, భార్య ప్రాణాలతో బయటపడ్డారు కాబట్టి సరిపోయింది. అదే వాళ్ల ప్రాణాలకు ఏమైనా జరిగి ఉంటే ఏమై ఉండేదని ప్రశ్నించారు. 

రాష్ట్ర పోలీసులు నిస్పక్షపాతంగా విచారణ జరుపుతారనే నమ్మకం లేదని బిజెపి నేత స్పష్టం చేశారు. ఈ కిడ్నాప్‌ వెనుక కడప,  పులివెందుల బ్యాచ్‌లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. నాలుగు రోజుల ముందు నుంచి, ఋషికొండ ప్రాంతంలో సెల్ ఫోన్ డేటా బయటకు తీస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని తెలిపారు.

 విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సతీమణి జ్యోతి, కొడుకు శరత్‌, ఆడిటర్ జీవిని కిడ్నాప్ వెనుక ఆర్ధిక లావాదేవీలు, సెటిల్‌మెంట్ వ్యవహారాలు ఉండి ఉండవచ్చని విష్ణుకుమార్ రాజు అనుమానం వ్యక్తం చేశారు విష్ణుకుమార్‌రాజు. ఎవరైనా కిడ్నాప్ చేస్తే బంధీలను తీసుకెళ్తారని ఆయన చెప్పారు.

కాని కిడ్నాపర్లు ఎంపీ ఇంట్లో చొరబడి ఎంపీ భార్య, కొడుకు, ఆడిటర్‌ని బంధించి, హింసించారంటే విశాఖలో హింస, అసాంఘీక శక్తులు ఏ స్థాయిలో పెట్రేగిపోయాయో అర్ధం చేసుకోవచ్చని అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
.ఏపీలోనే రాజకీయం జరుగుతోందనే విషయాన్ని సీఎం జగన్‌ తెలుసుకుంటే బాగుంటుందని చురకలంటించారు. ఇదేం పట్టనట్లుగా ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్‌కి గురైతే విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయని ముఖ్యమంత్రి అనుచిత వాఖ్యలు చేయడం పట్ల మండిపడ్డారు. సొంత పార్టీ నేత, అధికార ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తే సీఎం ఎందుకు సీరియస్‌గా స్పందించలేదని విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు.