పోలవరం పనుల్లో జాప్యానికి ఏపీ ప్రభుత్వమే కారణం

పోలవరం పనుల్లో జాప్యానికి ఏపీ ప్రభుత్వమే కారణమని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పష్టం చేసింది. పోలవరం పనుల జాప్యంపై సమచార హక్కు ద్వారా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి దరఖాస్తు రాగా, రాష్ట్ర ప్రభుత్వం కారణంగానే మందకోడిగా పోలవరం పనులు జరుగుతున్నాయని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ జవాబిచ్చింది.

2019 నుంచి 2023 వరకు పోలవరానికి రూ.7,654 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని, అనుకున్నంత వేగంగా పనులు ముందుకు సాగడం లేదని తెలిపింది. అలాగే అంచనా వ్యయం పెరగడానికి కారణాలు వెల్లడించింది. కాంట్రాక్టర్‌ను మార్చడం, భూసేకరణ, పునరావాసంపై అలసత్వం వహించిందని ప్రాజెక్ట్ అథారిటీ పేర్కొంది.

కరోనా సమయంలో పనులు నిలిచిపోవడం, డిజైన్ల మార్పు, రాష్ట్ర ప్రభుత్వం లోపభూయిష్టమైన ప్రణాళిక కారణమని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పేర్కొంది. పోలవరం నిర్మాణంలో భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం కొరవడిందని తేల్చింది.

2022 కమిటీ రిపోర్ట్ ప్రకారం  2024 జూన్‌కు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాదని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వెల్లడించింది.  నిధుల లేమితో కుంటుతున్న పోలవరం ప్రాజెక్టుకు భారీ ప్రమాదమే పొంచి ఉందని హెచ్చరించింది. ఎగువ కాఫర్‌ డ్యాంలో లీకేజీలు కనబడుతున్నాయి. ఈ సమయంలో భారీ వరదలు వస్తే దీనికి అంతులేని నష్టం జరుగుతుందని కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం కట్టకుండా జగన్‌ సర్కారు చేసిన జాప్యానికి అతిపెద్ద మూల్యమే చెల్లించుకునే పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంటున్నారు. గోదావరికి సహజంగా ఏటా వచ్చే 14 లక్షల క్యూసెక్కుల వరద కాకుండా, మరోసారి భారీగా 23 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తే ఎగువ కాఫర్‌ డ్యాంకు భారీనష్టం జరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం చేపట్టక ముందు ఎగువ కాఫర్‌ డ్యాంపై ఎలాంటి నీటి ప్రవాహ ఒత్తిడీ ఉండేది కాదు. కానీ దిగువ డ్యాం నిర్మాణంతో ప్రవాహ ఒత్తిడి క్రమంగా పెరు గుతోందని విశ్లేషిస్తున్నారు. ఎగువ కాఫర్‌ డ్యాంను 2018లోనే నిర్మించారు. అంటే, దీని వయసు ఐదేళ్లు.  ఒక మట్టి కట్టడం  ఇన్నేళ్లు భారీ వరదలకు తట్టుకుని నిలబడిందంటే.. గత నిర్మాణ సంస్థలు నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాయని కేంద్రమూ అంగీకరిస్తోంది.

అయితే తాజాగా ఎగువ కాఫర్‌ డ్యాంకు సీపేజీ ఉన్నట్లు, అంటే నీరు లీకవుతున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ గుర్తించింది. గోదావరికి జూలై నుంచి వరద వస్తుంది. కానీ నిరుడు జూన్‌ మొదటివారంలోనే భారీవరద వచ్చింది. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వరద అంతగా ఉండకపోవచ్చని జలవనరుల శాఖ అంటోంది. ఉధృతి అంతగా లేకపోతే పోలవరం పనులు చకచకా కొనసాగే అవకాశం ఉంది.

కానీ మహారాష్ట్రలో గోదావరికి భారీ వరద వస్తే,14లక్షల క్యూసెక్కులను దాటి ప్రవాహం వస్తే దాని ధాటికి ఎగువ కాఫర్‌ డ్యాం దెబ్బతింటే మాత్రం భారీమూల్యం చెల్లించుకోవలసి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.