ర‌ష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో మేం త‌ట‌స్టం కాదు

ఉక్రెయిన్‌పై ఏడాదికి పైగా రష్యా సాగిస్తున్న యుద్దం విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోందంటూ పశ్చిమ దేశాలు చేసిన ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తోసిపుచ్చారు. తాము శాంతి వైపే ఉన్నామని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనకు బయల్దేరే ముందు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

”మేం తటస్థ వైఖరి ప్రదర్శిస్తున్నామని కొంతమంది అన్నారు. కానీ మేం తటస్థం కాదు. శాంతి వైపు నిలబడుతున్నాం. దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ప్రతి దేశం గౌరవించాలి. దౌత్యపరమైన మార్గాలు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి. అంతేగానీ యుద్ధంతో కాదు” అని మోదీ తెలిపారు.

సమస్య పరిష్కారం కోసం రష్యా , ఉక్రెయిన్ దేశాల అధినేతలు పుతిన్‌, జెలెన్‌స్కీలతో తాను పలుమార్లు మాట్లాడినట్లు ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ”భారత్‌ ఏం చేయగలదో అన్నీ చేస్తోంది. ఘర్షణలను పరిష్కరించి ఇరు దేశాల మధ్య శాంతి, స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలను మేం సమర్థిస్తున్నాం” అని ప్రధాని తెలిపారు.

ఇక, భారత్‌-చైనా మధ్య సంబంధాల గురించి ప్రస్తావిస్తూ ”ద్వైపాక్షిక బంధాలు నిలబడాలంటే సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత, నిశ్చలమైన పరిస్థితులు చాలా ముఖ్యం. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంపై మాకు విశ్వాసం ఉంది” అని తెలిపారు.

అదే సమయంలో, భారత్‌ తన గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధంగా ఉందని మోదీ తేల్చి చెప్పారు. “సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, న్యాయ పాలనను పాటించడం, విభేదాలు,  వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంపై మాకు ప్రధాన నమ్మకం ఉంది. అదే సమయంలో, భారతదేశం తన సార్వభౌమాధికారం,  గౌరవాన్ని కాపాడుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది మరియు కట్టుబడి ఉంది” అని ప్రధాని పేర్కొన్నారు.

ముఖ్యంగా, చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో న్యూఢిల్లీలో పలుమార్లు సమావేశాలు జరిపిన దాదాపు నెల రోజుల తర్వాత భారత ప్రధాని నుంచి విమర్శనాత్మక వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఈ సమావేశంలో, న్యూఢిల్లీ సార్వభౌమాధికారం, సమగ్రతను సమర్థించినప్పుడే భారత్ చైనాతో నిమగ్నమై ఉంటుందని సింగ్ పునరుద్ఘాటించారు.

ప్రధాని మోదీ తన అమెరికా పర్యటన గురించి మాట్లాడుతూ రెండు దేశాల మధ్య సంబంధాలు గతంలో కంటే దృఢంగా, లోతుగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, జో బిడెన్‌కు న్యూఢిల్లీపై “అపూర్వమైన నమ్మకం” ఉందని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ, “భారతదేశం చాలా ఉన్నతమైన, లోతైన, విస్తృతమైన ప్రొఫైల్, పాత్రకు అర్హమైనది” అని ఆయన చెప్పారు. 

కాగా ప్రధాని మోదీ మంగళవారం అమెరికా పర్యటనకు బయల్దేరారు. రేప‌టి నుంచి ఆయన అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఐరాసలో జరిగే అంతర్జాతీయ యోగా వేడుకలకు ఆయన నేతృత్వం వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆతిథ్యాన్ని స్వీకరించనున్నారు. అనంత‌రం ఆయ‌న ఈజిప్ట్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు.

అమెరికాతో భార‌త్ బంధంపై చైనా అక్క‌సు

మరోవంక, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు ముందు చైనా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. చైనా ఆర్ధిక ప్ర‌గ‌తిని అడ్డుకునేందుకే భార‌త్‌ను అమెరికా అడ్డుపెట్టుకుంటోంద‌ని అడ్డ‌గోలు వ్యాఖ్య‌లు చేసింది. అమెరికా భౌగోళిక రాజ‌కీయ లెక్క‌ల‌తోనే భార‌త్‌తో ఆర్ధిక వాణిజ్య బంధాల‌ను పటిష్టం చేసుకునేందుకు సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ద‌ని చైనా అధికార ప‌త్రిక గ్లోబ‌ల్ టైమ్స్ ఎడిటోరియ‌ల్ అక్క‌సు వెళ్ల‌గ‌క్కింది.

అమెరికా ఇచ్చే హామీల‌కు కట్టుబ‌డి ఉండ‌ద‌ని చైనా అత్యున్న‌త దౌత్య‌వేత్త వాంగ్ యి పేర్కొన్నారు. చైనాకు వ్య‌తిరేకంగా జ‌రిపే బ‌ల్క్‌వార్‌లో భార‌త్‌ను అమెరికా ఉప‌యోగించుకుంటుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  అమెరికా భోగోళిక రాజ‌కీయ లెక్క‌ల‌ను అర్ధం చేసుకోవ‌డం క‌ష్ట‌మేమీ కాదని, చైనా ఆర్ధికాభివృద్ధిని కుంటుప‌రిచేందుకే భార‌త్‌తో వాణిజ్య స‌హ‌కారానికి అమెరికా మొగ్గుచూపుతున్న‌ద‌ని చైనా మాజీ విదేశాంగ‌మంత్రి వాంగ్ యి చెప్పుకొచ్చారు.

అంత‌ర్జాతీయ స‌ర‌ఫ‌రా చైన్‌లో చైనా స్ధానాన్ని భార‌త్ స‌హా మరే దేశం భ‌ర్తీ చేయ‌లేనందున అమెరికా భౌగోళిక రాజకీయ లెక్క‌లు విఫ‌ల‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు. బీజింగ్‌కు వ్య‌తిరేకంగా భార‌త్‌ను ఎగ‌దోసే ఆట‌లు ఫ‌లించ‌బోవ‌ని డ్రాగ‌న్ పేర్కొంది.