రియల్‌మీ గూఢచర్యానికి పాల్పడుతుందా?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ రియల్‌మీ( Realme)పై సంచలన ఆరోపణలు వచ్చాయి. భారతీయులపై గూఢచర్యానికి పాల్పడుతూ డేటాను తస్కరిస్తుందనే ఆరోపణలు వెలుగు చూశాయి. ఈ వార్త సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారం రేగుతున్నది. ఈ విషయం కేంద్రం దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు ప్రారంభించింది.
ఈ విషయాన్ని కేంద్ర సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్‌ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.
వినియోగదారుల కాల్ లాగ్స్‌తో పాటు ఎస్‌ఎంఎస్‌, లొకేషన్ తదితర సున్నితమైన డేటాను ట్రాక్‌ చేసే  ‘ఎన్‌హాన్స్‌డ్‌ ఇంటెలిజెంట్ సర్వీసెస్’ అనే ఫీచర్ తన ఫోన్ డేటాను ఉపయోగిస్తోందని చెబుతున్నారు.  ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ఆన్‌లైన్ స్వతంత్రంగా అలాంటి ‘ఫీచర్’ ఉనికిలో రియల్‌మీ ఫోన్లలో డిఫాల్ట్‌గా ఉందని ధ్రువీకరించింది. అయితే, దాన్ని కనుక్కునేందుకు కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే, ఆయా ఫోన్లలో ఈ ఫీచర్‌ ఉందో లేదో తెలుసుకునేందుకు సెట్టింగ్స్‌ > అదనపు సెట్టింగ్స్‌ > సిస్టమ్ సర్వీస్‌లోకి చెక్‌ చేయాలని చెబుతున్నారు. ఇది స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల లొకేషన్‌ను ట్రాక్ చేస్తోందని, ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిన వారి క్యాలెండర్ ఈవెంట్స్‌, కాల్ లాగ్‌లు, మెసేజ్‌లను సైతం రీడ్‌ చేయడంతో పాటు షేర్‌ చేసేందుకు అవకాశం ఉండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే, ఈ డేటా ప్రాథమికంగా ఛార్జింగ్‌ని ఆప్టిమైజ్ చేయడానికి, వాల్‌పేపర్‌లతో సహా ఫీచర్‌లను మెరుగుపరచడానికి సేకరించినట్లు రియల్‌మీ తెలిపింది. ఈ ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో దుమారం రేగుతున్నది. దీనిపై దర్యాప్తు చేయాలని కేంద్ర సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆదేశించారు.

అయితే ఎన్‌హాన్స్‌డ్ ఇంటెలిజెంట్ సర్వీసెస్ ఫీచర్‌కు సంబంధించి రియల్‌మీ స్పందిస్తూ ఫీచర్‌తో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచవచ్చని కంపెనీ తెలిపింది. వాస్తవానికి, ఈ ఫీచర్‌లో సర్వీస్‌, అనుభవాన్ని మెరుగుపరచడం పేరుతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు డివైజ్‌ సమాచారం, యాప్ వినియోగ డేటా, స్థానం, క్యాలెండర్ ఈవెంట్స్‌, సందేశాలు, మిస్డ్ కాల్ డేటా వంటి కొంత సమాచారాన్ని సేకరిస్తాయి.