గ్రామీ విన్నర్ తో కలిసి ప్రధాని మోదీ పాట

ముంబైలో జన్మించిన గాయని, పాటల రచయిత్రి ఫాల్గుణి షా అలియాస్ ఫాలు తో కలిసి తృణధాన్యాలు (మిల్లెట్స్) ప్రయోజనాలను, ప్రపంచంలో ఆకలి బాధలను తృణధాన్యాలతో తగ్గించగల అవకాశాలాను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రత్యేకమైన పాట రాశారు. అంతేకాదు, ఆ పాటలో తన గొంతు కూడా వినిపించారు.
 
 “ Abundance of Millets” అనే పేరుతో ఈ పాట శుక్రవారం విడుదలైంది. ఫాల్గుణి షా భర్త, గాయకుడు అయిన గౌరవ్ కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారు. భారత్ ప్రతిపాదించడంతో 2023 వ సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్య సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
‘‘ప్రధాని నరేంద్ర మోదీ తో కలిసి నేను, నా భర్త గౌరవ్ తృణ ధాన్యాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ పాట రాశాం. ఆ పాటను శుక్రవారం విడుదల చేసాము’’ అని గాయని ఫాలు వివరించారు. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. Abundance in Millets (తృణధాన్యాల్లో సమృద్ధి) పేరుతో ఈ పాటను నిన్న అప్‌లోడ్ చెయ్యగా.. ఇప్పటికే 6.3 వేల మంది చూశారు. చాలా మంది లైక్ చేస్తున్నారు.
ఈ పాటను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రాశారు. త్వరలో ఇతర భాషల్లోకి కూడా అనువాదం చెయ్యబోతున్నారు.  ముంబైలో పుట్టిన ఫాలూ  తర్వాత కుటుంభంతో సహా అమెరికాలో స్థిరపడ్డారు. 2022లో `ఎ కలర్ ఫుల్ వరల్డ్’ అనే ఆల్బమ్ కు బెస్ట్ చిల్డ్రెన్స్ ఆల్బమ్ కేటగిరీలోఆమెను గ్రామీ అవార్డ్ వరించింది. ఈ సందర్భంగా ఢిల్లీ  వచ్చిన ఫాలూ దంపతులు ప్రధాని మోదీని కలిశారు.
ఆ సమయంలో తనకు తృణధాన్యాలపై ఓ పాట రాయాలని ఉందని మోదీకి చెప్పారు. మోదీ కూడా ఆకలి నిర్మూలన కోసం కూడా ఆ పాట ఉండాలని సూచించారు. ఆ క్రమంలో వచ్చిందే ఈ పాట.  సంగీతం చాలా శక్తిమంతమైనదని, ఆ సంగీతం సాయంతో ప్రపంచంలోని ఆకలిని అంతం చేసే ప్రయత్నం చేయాలని ప్రధాని తనకు సూచించారని ఆమె చెప్పారు.
తృణ ధాన్యాల వినియోగాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని ప్రధాని చెప్పారని ఆమె తెలిపారు. తృణధాన్యాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న ప్రధాని మోదీ  ఆహార భద్రత, ఆకలిని తొలగించే ముఖ్యమైన ఉద్దేశంతో ఇలా పాట రూపొందించడం అద్భుతమైన ప్రయత్నం అని మోదీ మెచ్చుకున్నారు.

‘‘మోదీజీ సలహాతో పాట రాయడం వేరు, మోదీజీతో కలిసి పాట రాయడం వేరు. ఆయనతో కలిసి పాట రాసే అవకాశం నాకు దక్కింది. పాట మధ్యలో ఆయన గళంలోనే ఆయన రాసిన మాటలు వినిపిస్తాయి’’ అని ఫాలు వివరించారు. భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఇటీవల అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సింగర్ ఫాలు పాటలు పాడారు.