రష్యా నుండి 80 శాతం చమురు చైనా, భారత్ లకే

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు వినియోగ దేశాలైన భారత్‌, చైనాలు ఒక్క మే నెలలోనే రష్యా నుండి 80 శాతం చమురును తక్కువ ధరకే కొనుగోలు చేశాయని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఇఎ) తాజా నివేదిక వెల్లడించింది. రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో రష్యా తన చమురు తక్కువ ధరకే ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తోంది.
 
దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశాలైన భారత్‌, చైనాలు వాటి వినియోగానికి రష్యా చమురును భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. తాజాగా భారతదేశం రోజుకు 2 మిలియన్‌ బ్యారెళ్ల రష్యా చమురు కొనుగోళ్లను పెంచింది. ఇక చైనా రోజుకు 2.2 మిలియన్‌ బ్యారెళ్లకు పెంచినట్లు పారిస్‌కి చెందిన ఎనర్జీ ఏజెన్సీ తాజా ఆయిల్‌ మార్కెట్‌ నివేదకలో పేర్కొంది.
 
కాగా, రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో రష్యా చమురుపై అమెరికా ఆంక్షల్ని విధించిన సంగతి తెలిసిందే. దీంతో రష్యా చమురును అత్యధికంగా ఆసియా దేశాలకు సరఫరా చేస్తోంది. ఫిబ్రవరి 2022లో ప్రారంభమైన యుద్ధం తర్వాత రష్యా అత్యధికంగా చమురు సరఫరాను పెంచింది. ఒక్క మే నెలలోనే సముద్ర మార్గం నుండి రష్యా 3.87 మిలియన్‌ బ్యారెల్స్‌ చమురు ఎగుమతి చేసింది.
 
యుద్ధం తర్వాత రష్యా చమురు ఎగుమతి చేయడం ఇదే అత్యధికం. అలాగే ‘మే 2023లో రష్యా ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 80 శాతం భారత్‌, చైనాలు వాటా కలిగి ఉన్నాయని ఐఇఎ తెలిపింది. దీంతో భారత్‌, చైనాల క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతులు 20 శాతం నుండి 45 శాతానికి పెరిగాయి.  ప్రధానంగా యుద్ధ నేపథ్యంలో క్రూడ్‌ ఎగుమతి మార్కెట్లుగా ఉన్న ఐరోపా రష్యా క్రూడ్‌ ఆయిల్‌ ఎగుమతిని నిషేధించింది. ఇక జి7 దేశాలు కూడా సముద్ర మార్గంలో రష్యా ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. దీంతో రష్యాలోని సముద్రపు ముడి చమురు 90 శాతానికి పైగా ఇప్పుడు ఆసియావైపు వెళుతున్నాయి.
 
అంటే రష్యా ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు 34 శాతంగా ఉన్న ముడి చమురు ఎగుమతులు ప్రస్తుతం 90 శాతానికి పెరిగాయి. ఇక ఏప్రిల్‌ నెలలో రష్యా చమురు దిగుమతులు భారత్‌ 14 శాతానికి చేరి రికార్డు సృష్టించింది. తాజాగా ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలల్లో చమురు దిగుమతులు అత్యధిక స్థాయిలో ఉండడం వల్ల సరికొత్త రికార్డు భారత్‌ సృష్టించింది.
 
ఇక రష్యా చమురు దిగుమతుల వల్ల 2023 భారత జిడిపి 4.8 శాతానికి పెరుగుతుందని ఐఇఎ అంచనా వేసింది. చమురు దిగుమతులు ఇలానే కొనసాగితే రాబోయే సంవత్సరం 2024లో జిడిపి 6.3గా నమోదు కానుంది. 2025-28లో 7 శాతానికి జిడిపి వృద్ధిరేటు నమోదు కానున్నట్లు ఐఇఎ అంచనా వేసింది.
భవిష్యత్తులో భారత్‌లో జనాభా పెరగనున్న కారణంగా  2027కల్లా చైనాను అధిగమించనుందని ఐఇఎ తెలిపింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ చైనాను అధిగమించి 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది.
 
భారతదేశంలోని జనాభా పెరుగుదల వల్ల ‘పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, పర్యాటకం కోసం సంపన్న, మధ్యతరగతి ఆసక్తి వల్ల భారతీయ చమురు డిమాండ్‌ 2022 నుండి 2028 మధ్య రోజుకు 1 మిలియన్‌ బ్యారెళ్లకు పైగా పెరగనుందని ఐఇఎ వెల్లడించింది. ఇక డీజిల్‌ వినియోగం కూడా భారత్‌లో ఈ ఆరేళ్ల వ్యవధిలో 32 నుండి 35 శాతానికి పెరగనుందని ఐఎండి అంచనా వేసింది.