20 నుంచి అమెరికా, ఈజిప్ట్ ల్లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు రంగం సిద్ధమైంది. జూన్ 20 నుంచి 25 తేదీల మధ్య ప్రధాని మోదీ అమెరికా, ఈజిప్ట్ లలో  పర్యటించనున్నారని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ సందర్భంగా అమెరికా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

జీ 20 శిఖరాగ్ర సదస్సు కోసం ఈ సెప్టెంబర్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు కీలకమైన ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరనున్నాయి. అందులో ఒకటి యూఎస్ నుంచి 31 ఆయుధ సహిత డ్రోన్ల కొనుగోలుకు ఉద్దేశించిన ఒప్పందం.

మోదీ అమెరికా పర్యటన న్యూయార్క్ తో ప్రారంభమవుతుంది. జూన్ 21న ఆయన అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో పాల్గొంటారు. 2014 డిసెంబర్ లో జూన్ 21 వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూయార్క్ నుంచి మోదీ వాషింగ్టన్ వెళ్తారు.

జూన్ 22న వైట్ హౌస్ లో ఆయనకు ఘనమైన అధికారిక స్వాగతం లభిస్తుంది. అనంతరం, యూఎస్ అధ్యక్షుడు బైడెన్ తో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఆ రోజు ఆ ఇద్దరు నాయకుల సమక్షంలో ఇరు దేశాల ఉన్నత స్థాయి ప్రతినిధుల మధ్య చర్చలు, పలు ఒప్పందాలు జరుగుతాయి. జూన్ 22 సాయంత్రం మోదీ గౌరవార్ధం బైడెన్ దంపతుల ఆధ్వర్యంలో అధికారిక విందు జరుగుతుంది.

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ, సెనెట్ స్పీకర్ చార్లెస్ షూమర్ ఆహ్వానం మేరకు జూన్ 22న అమెరికా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి భారత ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. సాధారణంగా అమెరికా మిత్ర దేశాలు, అగ్ర దేశాల అధినేతలకే ఈ అవకాశం లభిస్తుంది. 2016 లో కూడా ప్రధాని మోదీ అమెరికా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

జూన్ 23న యూఎస్ ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ ప్రధాని మోదీ గౌరవార్ధం లంచ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలతో పాటు ప్రధాని మోదీ అమెరికాలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అలాగే, యూఎస్ లోని భారతీయులతో సమావేశమవుతారు.

అమెరికా నుంచి 24, 25 తేదీలలో ప్రధాని మోదీ ఈజిప్ట్ లో పర్యటిస్తారు. ఆ దేశాధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసి గత జనవరిలో భారత్ రిపబ్లిక్ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు భారత్ లో పర్యటించిన సందర్భంగా తమ దేశంలో పర్యటించామని ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఆ దేశ అధ్యక్షుడి ఆహ్వానంపై ఈజిప్ట్ లో పర్యటించి, ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడి ప్రభుత్వ సీనియర్ ప్రతినిధులతో, దేశంలోని ప్రముఖులతో, అక్కడి భారతీయ ప్రతినిధులతో సమావేశమవుతారు. ప్రధాని మోదీ ఈజిప్ట్ కు వెళ్లడం ఇదే ప్రథమం.