సావర్కర్ పాఠం తొలగింపుపై ఉద్ధవ్ మౌనం ఎందుకు!

కర్ణాటకలో విద్యార్థుల పాఠ్యాంశాల నుంచి సావర్కర్, హెడ్గేవార్ పాఠాలను తొలగించడంపై మౌనంగా ఎందుకు ఉన్నారని శివసేన-యూబీటీ నేత ఉద్ధవ్ థాకరేని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నిలదీశారు. అధికారం కోసం సిద్ధాంతాలతో రాజీ పడుతున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలో ఇటీవల కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల అచ్చు పుస్తకాల నుంచి స్వాతంత్ర్య సమర యోధుడు సావర్కర్, ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ పాఠాలను తొలగించింది. ఈ పాఠాలను బీజేపీ ప్రభుత్వం పాఠ్యాంశాల్లో చేర్చింది.

కొద్ది నెలల క్రితం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని హెచ్చరించారు. సావర్కర్ అంటే తమకు దైవంతో సమానమని చెప్పారు. సావర్కర్‌ను అవమానించడాన్ని తమ పార్టీ సహించబోదన్నారు. సావర్కర్‌ను అవమానిస్తే ప్రతిపక్ష కూటమిలో ఐకమత్యం దెబ్బతింటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, పుస్తకం నుంచి ఓ వ్యక్తి పేరును చెరిపివేయగలరు కానీ, ప్రజల హృదయాల నుంచి తొలగించలేరని చెప్పారు.

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారి పేర్లను ఎవరూ చెరిపివేయలేరని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై స్పందన ఏమిటో మహావికాస్ అగాడీ కూటమిలో కాంగ్రెస్‌తో భుజం భుజం కలిపి కూర్చున్నవారు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నను ఉద్ధవ్ థాకరేను అడుగుతున్నానని చెప్పారు.

ఓట్ల కోసం మైనారిటీలను బుజ్జగిస్తున్న విధానం మీకు అంగీకారయోగ్యమైనదేనా? వీర్ సావర్కర్ గారికి జరుగుతున్న అవమానాన్ని మీరు అంగీకరిస్తున్నారా? కుర్చీ కోసం రాజీపడుతున్నారా? అని ఫడ్నవిస్ నిలదీశారు.

‘‘ఉద్ధవ్ థాకరేకి నా ప్రశ్న. ఇప్పుడు చెప్పండి. మీ ప్రతిస్పందన ఏమిటి? మీరు ఎవరి ఒడిలో కూర్చున్నారో, వారు ఇప్పుడు స్వాతంత్ర్య సమర యోధుడు సావర్కర్ పేరును చెరిపేస్తున్నారు. మత మార్పిడులకు మీరు సంపూర్ణంగా మద్దతిస్తున్నారా? దీనిపై మీ కచ్చితమైన అభిప్రాయం ఏమిటో ఇప్పుడు మీరు చెప్పాలి. అధికారం కోసం రాజీపడుతున్నారా?’’ అని నిలదీశారు.