ఎన్నికల నాటికి కాంగ్రెస్ రాష్ట్ర సమితిగా బిఆర్ఎస్

టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందని చెబుతూ ఎన్నికల నాటికి సీఆర్ఎస్ (కాంగ్రెస్ రాష్ట్ర సమితి) గా మారడం ఖాయం అని బిజెపి సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ సంయుక్త మోర్చాల సమావేశంలో మాట్లాడుతూ  ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు ఎక్కడికి వెళ్లినా విపరీతమైన స్పందన లభిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పెరిగిందని తెలిపారు.

కేసీఆర్ పాలనకు 9 ఏళ్లు, మోదీ పాలనకు కూడా 9 ఏళ్లు అని చెబుతూ ఇద్దరి పాలనను బేరీజు వేయమని కోరారు. దేశ ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ అవినీతికి మచ్చలేని పాలన చేస్తున్న వ్యక్తి నరేంద్రమోదీ అని,  ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే వ్యక్తి మోదీ అని తెలిపారు.

 కేసీఆర్ పాలన యావత్తు అవినీతి, కుటుంబ పాలనే ధ్యేయంగా పాలన కొనసాగుతోందని జవదేకర్ ధ్వజమెత్తారు.  కేసీఆర్ ది 60 పర్సంట్ కరప్షన్ సర్కార్.. కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని విమర్శించారు. ఈ విషయాన్ని ఒక్కో మోర్చా కార్యకర్త ప్రతిరోజు మూడు ఇళ్లకు వెళ్లి ప్రచారం చేయాలని ఆయన కోరారు.
 
2024 ఎన్నికల్లో  తెలంగాణాలో 14 ఎంపీ సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం అంటూ భరోసా వ్యక్తం చేశారు. నీళ్లు-నిధులు-నియామకాల నినాదానికి కేసీఆర్ నీళ్లొదిలారని ధ్వజమెత్తారు. బీజేపీకి అవకాశమిస్తే  ‘‘నీళ్లు-నిధులు-నియామకాలు’’ నినాదాన్ని సాకారం చేసి తీరుతామని స్పష్టం చేశారు. అట్లాగే ప్రతి ఒక్కరు బీజేపీకి మద్దతు పలుకుతూ 9090902024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వగానే మెసేజ్ వస్తుందని తెలిపారు.
 
నరేంద్రమోదీ తనకు మంచి మిత్రుడంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొట్టిపారేశారు. నరేంద్రమోదీ పేరు వింటేనే కేసీఆర్ గజగజ వణికిపోతాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలతో బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేననే భావన కలిగించాలని, తద్వారా తెలంగాణలో పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీయాలన్నదే కేసీఆర్ వ్యూహమని పేర్కొన్నారు.
ఈనెల 22న ఉదయం 7 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యకర్త పోలింగ్ బూత్ వారీగా ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో ప్రచారం నిర్వహించాలని ఆయనరారు.  కేసీఆర్ పాలనలో రాష్ట్రం రూ.5 లక్షల కోట్ల అప్పులపాలైందని చెబుతూ  పొరపాటున మళ్లీ అధికారమిస్తే మరో రూ.5 లక్షల కోట్ల అప్పు చేస్తడని హెచ్చరించారు. కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తున్నడని, మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వడం లేదని చెబుతూ అయినా తెలంగాణను అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు.