లంచం తీసుకొంటూ తెలంగాణ యూనివర్సిటీ వీసీ అరెస్ట్

రూ. 50 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన నిజామబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తాను ఏసీబీ అధికారులు శ‌నివారం సాయంత్రం అరెస్టు చేశారు. తార్నాక‌లోని ఆయ‌న నివాసంలో దాదాపు 8 గంట‌ల పాటు సోదాలు నిర్వ‌హించిన అనంత‌రం ర‌వీంద‌ర్ గుప్తాను అరెస్టు చేస్తున్న‌ట్లు ఏసీబీ అధికారులు ప్ర‌క‌టించారు.
 
ర‌వీంద‌ర్ గుప్తాను ఏసీబీ అధికారులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మ‌రికాసేప‌ట్లో ప్ర‌త్యేక ఏసీబీ కోర్టులో ర‌వీంద‌ర్ గుప్తాను అధికారులు హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు. నిజామాబాద్ జిల్లా ప‌రిధిలోని భీమ్‌గ‌ల్‌లో ప‌రీక్షా కేంద్రం ఏర్పాటుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు వీసీ ర‌వీంద‌ర్ గుప్తా రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
 
హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న తన నివాసంలో లంచం  తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని ఆయనను పట్టుకున్నారు.  పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం వీసీ రవీందర్ గుప్తా డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు శంకర్ ఏసీబీని ఆశ్రయించారు. వీసీ ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డిన త‌ర్వాత విద్యార్థులు తెలంగాణ యూనివ‌ర్సిటీలో సంబురాలు నిర్వ‌హించారు.
వీసీ రవీందర్‌గుప్తా నివాసంలో ఏసీబీ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీసీ బ్యాంక్ అకౌంట్లు ఇతర పత్రాలను తనిఖీ చేశారు. గత వారమే ఆయనపైన ఆరోపణలు రావడంతో ఏసీబీ టీమ్ నేరుగా యూనివర్శిటీకి వెళ్ళి ఆయన ఛాంబర్‌లో సోదాలు నిర్వహించింది. ఆ తనిఖీల్లో ఏ వివరాలు దొరికాయన్నది గోప్యంగానే ఉంచారు. రవీందర్ గుప్తా ఏసీబీ ట్రాప్‌కు చిక్కడంతో ఆయన హయాంలో వర్శిటీలో జరిగిన గోల్‌మాల్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 
 
వర్సిటీలో నియామకాలు, నిధులపై కొంతకాలంగా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. రిజిస్ట్రార్‌ నియామకం విషయంలోనూ వీసీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే తాజాగానే వెనక్కి తగ్గిన ఆయన రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ యాదగిరిని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులి చ్చారు.
గతంలో రిజిస్ట్రార్‌ నియామకం విషయంలో పాలక మండలితో వీసీ తీవ్రంగా తలపడ్డారు. పరిస్థితులు రోజురోజుకూ ప్రతికూలంగా మారుతుండటంతో చివరకు యాదగిరికి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించారు.