తెలంగాణకు మోదీ ప్రభుత్వంలో రూ 9.80 లక్షల కోట్ల నిధులు

తెలంగాణకు నిధులు ఇవ్వకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్నదని అధికార బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ, గత తొమ్మిదేళ్లలో తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వానికీ, ప్రభుత్వ సంస్ధలకు, కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వం రూ. 9,80,904 కోట్ల సాయం అందించినట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు.
 
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయంపై సమగ్ర నివేదికను ఆయన శనివారం ప్రజలకు సమర్పించారు.
నాబార్డు ద్వారా వివిద సంస్ధలకు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు రుణాలు అందించినట్లు, వివిధ ప్రభుత్వ సంస్థలకు వడ్డీ లేని మరో లక్షన్నర కోట్ల రూపాయలు అందించినట్లు కూడా కేంద్ర మంత్రి చెప్పారు.
 
వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా మరో రెండున్నర లక్షల కోట్ల రూపాయిల నిధులను రాష్ట్రంలో ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. గత యూపీఏ ప్రభుత్వ హాయాంతో పోలిస్తే పన్నులలో రాష్ట్రాల వాటా గణనీయంగా పెరిగిందని గుర్తు చేశారు.
 
తెలంగాణ వాటా కింద ఇంతవరకు రూ. 1.60 లక్షల కోట్లను అందించినట్లు, వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకోసం రాష్టంలో రూ. 5. 27 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యుల అభివృద్ది నిధి కింద రూ. 983 కోట్లను అందించినట్లు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద రూ. 2250 కోట్లను అందించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఇదే సమయంలో మూడు కొత్త రైలుమార్గాలను నిర్మించి, 1645 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. ఉడాన్ పధకంకింద రైలు మార్గాలను గణనీయంగా పెంచినట్లు తెలిపారు. హైదరాబాద్ లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ను రూ. 353 కోట్తో ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. విద్యుత్ రంగంలో దాదాపు రూ. 11 వేల కోట్లతో రామగుండం 1600 మెగావాట్ల ప్రాజెక్టును పునర్నించినట్లు తెలిపారు.

దేశంలో అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టును రూ. 443కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సౌభాగ్య పధకంకింద 5 లక్షలపైగా ఇళ్ళకు ఉచిత విద్యుత్ సదుపాయం అందించినట్లు పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ కార్యక్రమం, అమృత్ కార్యక్రమం కింద పలు‌ మునిసిపాలిటీల అభివృద్దికి వందలాది కోట్ల రూపాయల సాయం అందించినట్లు చెప్పారు.

 ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రంలో తగిన పురోగతి లేదని,  అయితే రాష్ట్రంకు రూ.  4400 కోట్లను అందించినట్లు చెప్పారు. గ్రామీణ అభివృద్ధి కింద  రూ.  2,500 కోట్లను కేటాయించి, పురపాలికలకు దాదాపు రూ. 7 వేల కోట్ల రూపాయను కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో రైతులకు సమ్మాన్ నిధి కింద రూ. 9  వేల కోట్లకు పైగా అందించినట్లు,  రూ. 1.24 లక్షల కోట్లను ఖర్చుచేసి 20 లక్షల మంది రైతులనుంచి ధాన్యంకొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

ఇతర వ్యవసాయ పధకాల కింద రూ. 1220 కోట్ను అందించినట్లు పేర్కొన్నారు. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 11 సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందని తెలిపారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీని త్వరలో నిర్మిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.