ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై వేయి పేజీల ఛార్జిషీట్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్  తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో గత కొన్ని నెలలుగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనల్లో భాగంగా నమోదైన కేసులో  ఢిల్లీ పోలీసులు వెయ్యి పేజీల భారీ ఛార్జిషీట్‌ను కోర్టుకు గురువారం సమర్పించారు. ఐపీసీలోని 354, 354డీ, 354ఏ& 506 (1) సెక్ష‌న్ల కింద చార్జిషీట్ దాఖ‌లు చేశారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదైన కేసుల్లో రెండు బెయిలబుల్ నేరాలతోపాటు మరో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. పాటియాలా హౌస్ కోర్టులో ఈ ఛార్జిషీటును దాఖలు చేశారు.  అయితే బ్రిజ్‌భూషణ్‌కు పోక్సో కేసులో ఢిల్లీ పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న ఏడుగురు రెజ్లర్లలో ఒకరు మైనర్ అని, ఆమెపైనా బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడని ఆ మైనర్ తండ్రి మొదట ఫిర్యాదు చేయడంతో ఏప్రిన్ 28 న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో బ్రిజ్ భూషణ్‌పై పోక్సో చట్టం కింద కూడా కేసు పెట్టారు.
 
అయితే తర్వాత ఆమె మైనర్ కాదని, ఆమె తండ్రి తన కేసును వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆయనపై పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ పాటియాలా హౌస్ కోర్టుకు 500 పేజీల నివేదికను ఢిల్లీ పోలీసులు సమర్పించారు. దీనిపై జులై 4 వ తేదీన కోర్టులో విచారణ జరగనుంది. ఇక మిగితా ఆరోప‌ణ‌ల్లో మాత్రం ఆయ‌న‌పై విచార‌ణ కొన‌సాగ‌నున్న‌ది

బ్రిజ్ భూషణ్ ఓ మైనర్ సహా ఏడుగురు రెజ్లర్లపై లైంగిక దాడి జరిపినట్లు ఆరోపణలు నమోదైన సంగతి తెలిసిందే. ఆయనపై ఢిల్లీ పోలీసులు 2 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. అంతర్జాతీయ కోచ్, రిఫరీతో పాటు పలువురు రెజ్లర్లను విచారించిన అనంతరం పోలీసులు ఛార్జిషీటును దాఖలు చేశారు.  లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌పై 25 మంది ఇచ్చిన స్టేట్‌మెంట్లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు.

ఫిర్యాదుదారైన ఓ మహిళా రెజ్లర్‌ను ఇటీవల పోలీసులు రెజ్లింగ్ ఫెడరేషన్ కార్యాలయానికి తీసుకెళ్లి, దర్యాప్తు చేశారు. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలను రుజువు చేయడానికి ఆడియో, వీడియో, ఫొటో సాక్ష్యాధారాలను సమర్పించాలని ఆయనపై ఆరోపణలు చేసిన ఇద్దరు మహిళా రెజ్లర్లను పోలీసులు కోరారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారెవరూ ఢిల్లీ పోలీసులకు సాక్ష్యం చెప్పలేదు.

ఈ కేసులో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆధారాలు, సమాచారాన్ని అందజేయాలని ఇతర దేశాల రెజ్లింగ్ ఫెడరేషన్లకు కూడా ఢిల్లీ పోలీసులు లేఖలు రాశారు. కానీ ఎటువంటి సమాచారం రాలేదు. ఒకవేళ విదేశీ ఫెడరేషన్లు సమాచారం ఇస్తే, అదనపు ఛార్జిషీటును దాఖలు చేస్తారు. ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లతో విడివిడిగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బ్రిజ్‌ భూషణ్‌పై జూన్ 15 లోపు ఛార్జిషీట్ దాఖలు చేస్తామని మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ ఇవ్వడంతో రెజ్లర్లు తమ నిరసనలను తాత్కాలికంగా విరమించారు.