ఫేస్‌బుక్‌ సేవలు నిలిపివేస్తామని కర్ణాటక హైకోర్టు హెచ్చరిక

భారత్ లో కార్యకలాపాలు నిలిపివేసేలా ఆదేశాలిస్తామని కర్ణాటక హైకోర్టు  ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ను హెచ్చరించింది. తమ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేసింది.  కర్నాటకకు చెందిన వ్యక్తి ఫేస్ బుక్ ఫేక్ అకౌంట్ కారణంగా సౌదీ అరేబియాలో అన్యాయంగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడన్న కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు పై ఆదేశాలను ఇచ్చింది.

వివరాల్లోకి వెళ్ తే.. కర్నాటకలోని మంగళూరుకు చెందిన శైలేశ్ కుమార్ గత 25 ఏళ్లుగా సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్య కవిత పిల్లలతో కలిసి మంగళూరు సమీపంలోని బికర్నకట్టె గ్రామంలో ఉంటోంది. 2019లో ఎన్ఆర్సీ , సీఏఏ లకు మద్దతుగా శైలేశ్ ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత, శైలేశ్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తి ఫేస్ బుక్ లో ఒక ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేశాడు.

ఆ అకౌంట్ లో సౌదీ రాజుపై, ఇస్లాంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దాంతో, ఆ పోస్ట్ లు పెట్టింది శైలేశ్ అన్న భావనతో సౌదీ పోలీసులు శైలేశ్ ను అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు. సౌదీ రాజుపై, ఇస్లాం మతంపై అభ్యంతరకర పోస్టు పెట్టిన నేరానికి జైలు శిక్ష విధించారు. తన పేరుతో నకిలీ ఖాతాను సృష్టించిన దుండగులు ఈ పని చేశారంటూ శైలేష్ ఎంత చెప్పినా అక్కడి అధికారులు వినిపించుకోలేదు.

ఈ విషయం తెలిసి శైలేష్ భార్య కవిత మంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు శైలేష్ కుమార్ పేరుతో నకిలీ ఖాతాకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని ఫేస్ బుక్ కు లేఖ రాశారు. కానీ వారి అభ్యర్థనలకు ఫేస్ బుక్ స్పందంచలేదు.

దాంతో, 2021 లో కవిత కర్ణాటక హై కోర్టును ఆశ్రయించింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఫేస్ బుక్ పట్టించుకోలేదు. కవిత పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేసు విచారణకు సహకరిస్తూ, అందుకు అవసరమైన సమాచారంతో కూడిన పూర్తి నివేదికను వారం రోజుల్లో కోర్టుకు సమర్పించాలని ఫేస్ బుక్ ను ఆదేశించింది.

లేనిపక్షంలో భారత్ లో ఫేస్ బుక్ సేవలను నిలిపేసే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. మంగళూరు పోలీసులు కూడా సమగ్ర విచారణ చేపట్టి.. నివేదికను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. శైలేశ్ ను సౌదీలోని జైలు నుంచి విడిపించడానికి చేపట్టిన చర్యల గురించి వివరిస్తూ నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.