ఉమ్మడి పౌర స్మృతిపై లా కమిషన్‌ కసరత్తు

ఉమ్మడి పౌర స్మృతి రూపకల్పన విషయమై లా కమిషన్‌ బుధవారం తాజాగా సలహా సంప్రదింపులను ప్రారంభించింది. రాజకీయంగా సున్నితమైన ఈ విషయమై అందరూ భాగస్వాములు, మత సంస్థల నుంచి అభిప్రాయాలను తెలుసుకోనుంది.

ఇంతకుముందు ఉన్న 21వ లా కమిషన్‌ కూడా రెండు సార్లు ఇదే విధంగా అభిప్రాయాలు సేకరించింది. ఫ్యామిలీ లా సంస్కరణల పేరుతో 2018లో సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. ఆ పత్రాన్ని ప్రజానీకం ముందుకు తెచ్చి మూడు సంవత్సరాలు కావడం, ఈ మధ్యకాలంలో కొన్ని తీర్పులు రావడంతో మరోసారి అభిప్రాయాలు సేకరించనున్నట్టు ప్రస్తుతం ఉన్న 22వ లా కమిషన్‌ తెలిపింది.

పైగా, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఎస్.చౌహాన్‌ ఆధ్వర్యంలోని 21వ లా కమిషన్‌ ఉమ్మడి పౌర స్మృతిపై అంతగా ఆసక్తి చూపలేదు. భిన్నత్వాన్ని ప్రపంచ దేశాలు అంగీకరిస్తున్నాయని తెలిపింది. భిన్నత్వం ఉండడం అంటే వివక్ష చూపించినట్టు కాదని పేర్కొంది.  ఉమ్మడి పౌర స్మృతి రూపకల్పనపై వైఖరి చెప్పాలని 2016లో కేంద్ర న్యాయ శాఖ కోరింది.

ఈ మధ్యనే మూడేళ్ళ పదవీకాలాన్ని పొడిగింపు పొందిన 22వ లా కమీషన్ అందుకు అనుగుణంగా అందరి అభిప్రాయాలు తెలుసుకోనున్నట్టు వివరించింది. దీని ప్రకారం,  ఉమ్మడి పౌర స్మృతి గురించి గుర్తింపు పొందిన మత సంస్థలలో ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలను కోరాలని 22వ లా కమిషన్ మళ్లీ నిర్ణయించిందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఆసక్తి, ఇష్టమున్న వారు నోటీసు పంపిన తేదీ నుండి 30 రోజుల వ్యవధిలో తమ అభిప్రాయాలను లా కమిషన్‌కు తెలియజేయవచ్చు.

అంతకుముందు ఏప్రిల్ 18 న, కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూ ఢిల్లీలో ఈ అంశంపై మొదటి ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. అప్పటి న్యాయ మంత్రి కిరణ్‌ రిజిజు, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, న్యాయ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ఇతర కీలక బీజేపీ నేతలు ఆ సమావేశానికి హాజరయ్యారు.

దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే తగిన సమయంలో, అన్ని ప్రజాస్వామ్య విధానాలను అనుసరించిన తర్వాత తీసుకు వస్తుందని అమిత్ షా తెలిపారు. ముఖ్యంగా, ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడం గురించి జనసంఘ్ రోజుల నుండి భారతీయ జనతా పార్టీ వాగ్దానం చేస్తూ వస్తోంది.

 వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి అనేక విషయాలలో అన్ని మత వర్గాలకు వర్తించే విధంగా భారతదేశానికి ఒక చట్టాన్ని రూపొందించాలని  ఉమ్మడి పౌర స్మృతి పిలుస్తుంది. ఈ కోడ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ద్వారా తప్పనిసరి చేయబడింది.

ఇది భారతదేశ భూభాగం అంతటా తన నివాసితుల కోసం ఏకరీతి సివిల్ కోడ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తప్పనిసరిగా పని చేయాలని ఈ ఆర్టికల్ పేర్కొంది. శతాబ్దానికి పైగా ఈ అంశం రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా ఉన్నందున పార్లమెంటులో చట్టం కోసం ఒత్తిడి తెస్తున్న బీజేపీ దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది.